కార్మికులపై దోపిడీ ఇంకానా.. ఇక చెల్లదు!

కార్మికులపై దోపిడీ ఇంకానా.. ఇక చెల్లదు!

అమెరికాలోని కార్మికులనే కాక ప్రపంచ కార్మికులందరినీ ప్రభావితం చేసిన ‘‘చికాగో హేమార్కెట్ సంఘటన”తో మేడేకు తొలి అడుగు పడింది. 1886, మే 1న కార్మికుల ర్యాలీగా మొదలై మే 4న జరిగిన ఈ సంఘటన చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయింది. అయితే ఈ సంఘటన జరిగిన తొలి నాళ్లలో దాని ప్రాముఖ్యతను గుర్తించిన వారు చాలా తక్కువ మందే. ఎందుకంటే హేమార్కెట్​ ఎఫైర్​ జరిగిన వందేండ్ల తర్వాత అంటే 1992లో మాత్రమే ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని ‘చికాగో ల్యాండ్ మార్క్’ గా ప్రకటించారు. 2004లో అక్కడ ఒక శిల్ప కళా ఖండాన్ని ప్రతిష్టించారు. ఆనాడు అమరులైన నిరసనకారులను ఖననం చేసిన ఫారెస్ట్ పార్కులో నిర్మించిన ‘‘హే మార్కెట్ అమరుల స్మారక కట్టడం”.. 1997లో జాతీయ చారిత్రక ల్యాండ్ మార్క్​గా ప్రకటించారు.
అమెరికాలో లాయల్టీ డేగా..
ప్రపంచవ్యాప్తంగా ‘మే డే’ లేదా ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’గా పిలవబడుతున్న మే 1ని అమెరికాలో ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. చాలా దేశాల్లో ‘మేడే’ని సెలవు దినంగా పాటిస్తున్నారు. అయితే ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో చికాగోలోని హే మార్కెట్‌‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే మే డే పుట్టుకకు పునాది వేసిందని చరిత్రకారులు చెబుతుంటారు. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం డిమాండ్​తో 1886, మే1న కార్మికులు నిరసన చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్‌‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలా మంది కార్మికులు చనిపోయారు. అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు ఊపందుకున్నాయి.
8 గంటల పని డిమాండ్​తో..
బ్రిటన్‌‌లోని హైడ్ పార్క్‌‌లో 1890, మే 1న  చేపట్టిన ప్రదర్శనలో దాదాపు 3 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రోజులో 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే వారి ప్రధాన డిమాండ్. ఇదే తరహాలో మిగతా యూరోపియన్ దేశాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. 1892లో అమెరికాలో ప్రజా ప్రయోజన నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికుల పని గంటలను 8 గంటలకు కుదిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ క్రమంలో షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడం మొదలైంది. 
ప్రపంచవ్యాప్తంగా నిరసనలు
యూరప్‌‌లో 1900 నుంచి 1920 వరకూ ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసనలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తర్వాతి దశకాల్లో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు. ఇటలీలో ముస్సోలిని, స్పెయిన్‌‌లో జనరల్ ఫ్రాంకో మే డే పైన అనేక ఆంక్షలను విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాల్లో మే1ని సెలవు దినంగా పాటించడం మొదలైంది. ఆ తర్వాత అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. కార్మికులకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలను చాలా దేశాలు ఆ రోజునే అమల్లోకి తీసుకొచ్చాయి. ఆ విధంగా అటు సంక్షేమ పథకాల అమలుతోపాటు నిరసన ప్రదర్శనలకు మే 1 వేదికగా మారింది. వేర్వేరు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలయ్యాయి. పలు ఇతర కార్మిక ఉద్యమాలు కూడా మే డే నాడే ప్రాణం పోసుకున్నాయి.
చికాగో కన్నా ముందే కలకత్తాలో..
మన దేశంలో చికాగో సంఘటన కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌‌లో ‘‘అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో.. మేము కూడా అన్ని గంటలే పనిచేస్తాం’’ అనే డిమాండ్​తో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అయితే ఆ సమ్మె విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. అందువల్ల అది ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920లో ట్రేడ్‌‌ యూనియన్‌‌ ఏర్పడిన తర్వాత కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం లాంటి కారణాల వల్ల మన దేశంలో 1923లో మొదటిసారి ‘మే డే’ను పాటించారు. అప్పటి నుంచి దేశంలో ‘మే డే’ని పాటిస్తున్నారు. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌‌, లిబరలైజేషన్‌‌, గ్లోబలైజేషన్‌‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అంతగా అమలుకు నోచుకోవడం లేదు. కార్మికుల పని వాతావరణంతోపాటు వేతనాలు మెరుగవ్వాలన్నది చాలాకాలంగా లేబర్ యూనియన్ల ప్రధాన డిమాండ్‌‌గా మారింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తున్నారు. ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు చేపడతాయి. 
ఆగని శ్రమ దోపిడీ
ఈనాడు మార్కెట్‌‌ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉంటే అక్కడ కంపెనీలు పెడుతున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి.. కార్మిక చట్టాలు అంతగా అమలు కానటువంటి దేశాల్లో కంపెనీలు పెడుతూ వాళ్లచేత రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేయిస్తున్నారు. ఇందుకు మన దేశం మినహాయింపు కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇచ్చే బహుళజాతి కంపెనీలను మాత్రమే దేశంలోకి ఆహ్వానించే వాతావరణం మన దేశంలో నెలకొంటేనే ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులను శ్రమ దోపిడీ నుంచి రక్షించగలమని గ్రహించాలి. 
కలసికట్టుగా కృషి చేయాలె
ప్రపంచంలో ఎనిమిది గంటల పని కోసం చేసిన నాటి పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. ఆనాడు ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను పణంగా పెట్టి నాటి కార్మిక వర్గ పోరాటాలు సాధించిన ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తు న్నప్పటికీ, ఇప్పుడున్న మార్కెట్‌‌ శక్తుల వ్యూహాలు పాత పరిస్థితులను పునరావృతం చేస్తాయనే అనుమానం లేకపోలేదు. ‘‘చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా? ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని వేరే జాతీ, పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై సాగదు’’ అన్న శ్రీశ్రీ ఏనాడో చెప్పిన మాటల్లోని ఆంతర్యాన్ని అందరూ గమనించాలి. ఈ కరోనా సంక్షోభంలో కూడా అత్యవసర విధులను నిర్వర్తిస్తున్న వివిధ రంగాల్లోని కార్మికులకు గుర్తింపు దక్కాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని గౌరవిస్తూ, ప్రతీ కార్మికుడు తలెత్తుకొని సగర్వంగా జీవిస్తూ ఈ ప్రపంచ ప్రగతికి పాటుపడే అవకాశం అందుకోవాలి. తద్వారా ప్రపంచ శాంతి సాధనకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఆశిద్దాం.