ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉత్పత్తిలో నంబర్​వన్​గా అర్జీ 1 ఏరియా

గోదావరిఖని, వెలుగు: అర్జీ  1 ఏరియా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించి సింగరేణిలోనే నంబర్ వన్ గా నిలిచిందని జనరల్ మేనేజర్ కె.నారాయణ తెలిపారు. శుక్రవారం జీఏం ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ అర్జీ 1 ఏరియా సెప్టెంబర్ లో 128శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. దీంతోపాటు 17 లక్షల 3 వేల టన్నుల వార్షిక లక్ష్యానికి 18 లక్షల 94 వేల టన్నుల ఉత్పత్తిని సాధించి 111 శాతంతో సింగరేణి వ్యాప్తంగా ఫస్ట్​ప్లేస్​లో నిలిచిందని చెప్పారు. భారీ వానలు పడినా కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి సింగరేణిలో ప్రధాన సమస్యగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. అక్టోబర్ చివరివరకు కార్మిక వాడల్లో 3 ఆర్వో ప్లాంట్స్ కూడా పూర్తవుతాయని తెలిపారు. మీడియా సమావేశంలో ఏరియా ఇంజినీరు జగన్మోహన్​రావు, ఏజీఎం ఫైనాన్స్ రామకృష్ణ , ఓసీ 5 పీవో చంద్ర శేఖర్, ఏజెంట్ బానోతు వెంకన్న , డీజీఎం సివిల్ నవీన్, డీజీఎంఐ ఈడీ ఆంజనేయులు , పర్సనల్ మేనేజర్ సలీం , కమ్యునికేషన్  ఆఫీసర్ సారంగపాణి , ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పాల్గొన్నారు.

పాత పెన్షన్​ విధానాన్ని కొనసాగించాలి

కొత్తపల్లి, వెలుగు: సీపీఎస్​ రద్దుచేసి ఓపీఎస్​ అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్​, నిజామాబాద్​, మంచిర్యాల, ఆదిలాబాద్​, పెద్దపల్లి జిల్లాల టీచర్స్​ శుక్రవారం క్రికెట్​ ఆడి నిరసన తెలిపారు. తెలంగాణ టీచర్స్​ ప్రీమియం లీగ్​ను ఢిల్లీ డిఫెన్స్​ అకాడమీ, జూనియర్​ కాలేజీ చైర్మన్​ కొత్త సతీశ్​రెడ్డి ఆధ్వర్యంలో రేకుర్తిలో నిర్వహించారు. విజేతలకు బద్దం రాజమణి దంపతులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్​ ఆర్గనైజర్స్​ స్టాలిన్​బేగ్​, కిశోర్, జయకృష్ణారెడ్డి, నవీన్​, గోల్కొండ శ్రీధర్, హనుమండ్ల భాస్కర్​ పాల్గొన్నారు.

బీజేపీ సీనియర్​ నేతకు సన్మానం 

పెద్దపల్లి, వెలుగు: ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని భవానీమాతను కోరుకున్నట్లు బీజేపీ సీనియర్​ నాయకులు గొట్టిముక్కల సురేశ్​రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని బ్రాహ్మణ సంఘం, శివాలయం వీధి ,రాఘవాపూర్, రంగాపూర్ గ్రామాలలో కొలువైన దుర్గామాత అమ్మవార్లకు సురేశ్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వాహకులు సురేశ్​రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ఎరబాటి రమాకాంత్, హరి, శ్రీనివాస్, మూర్తి, బాలాజీ సింగ్, క్రాంతి సింగ్, బాషా, హనుమాన్ సింగ్, శ్రీధర్, అరుణ్, అనిల్ పాల్గొన్నారు.

మోడీ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మంథని, వెలుగు: మంథని నియోజకవర్గంలోని గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మోడీ కప్​క్రికెట్​టోర్నమెంట్​నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్​రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్​రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ చరిత్రలోనే తొలిసారి టోర్నమెంట్ విజేతలకు ఫస్ట్ ప్రైజ్​రూ.రెండు లక్షలు, సెకండ్​ప్రైజ్​రూ.70వేలు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల రాజు, పట్టణ అధ్యక్షులు సదాశివ్, పట్టణ కార్యదర్శి సంతోష్, మండల ఇన్​చార్జి చిలువరి సతీశ్, ఆర్గనైజర్ టి.రాజు, రిత్విక్  పాల్గొన్నారు. 

ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు: తెలంగాణ లో టీఆర్ఎస్​ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలేసి జాతీయ పార్టీ పెడతా అనడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం బీజేపీ–టీఆర్ఎస్​మధ్య ఉన్న సీక్రెట్ ఫ్రెండ్షిప్ కు నిదర్శనమన్నారు. రైతులకు వడ్డీ రాయితీ, విత్తన రాయితీ ఇవ్వని రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేన్నారు. 24 గంటలు ఉచిత కరెంట్​సప్లై చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, 24 గంటలు సప్లై అవుతున్న ఒక్క ట్రాన్స్ ఫార్మర్​ను చూపించినా సీఎం కేసీఆర్​కు క్షీరాభిషేకం చేస్తానని తెలిపారు. వేల కోట్లు పెట్టి తీసుకొచ్చిన మిషన్​భగీరథ ద్వారా వచ్చే నీరు కేవలం పాకీ పనులకే ఉపయోగపడుతోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశానికి రోల్ మోడల్ తెలంగాణ

కొడిమ్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మెడల్ గా మారిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. శుక్రవారం ఎంపీపీ స్వర్ణలత అధ్యక్షతన చేప్పట్టిన మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెంది జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించిందన్నారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తిమ్మయ్య పల్లి విలేజ్ లో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రశాంతి, కొడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ రాజ నర్సింగ రావు, సర్పంచ్​ల ఫోరమ్ అధ్యక్షుడు కృష్ణా రావు, సర్పంచ్​లు లత, రాధ పాల్గొన్నారు.

అనాథ పిల్లలతో భోజనం 

గంగాధర, వెలుగు: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ దంపతులు చొప్పదండి, గంగాధర మండలాలకు చెందిన అనాథ పిల్లలతో కలిసి భోజనం చేశారు.  గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో 20 మంది పిల్లలకు భోజనం వడ్డించారు. 

ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలి

సుల్తానాబాద్, వెలుగు: కేడీసీసీబ్యాంకులో గూగుల్ పే, ఫోన్ పే సేవలు అందుబాటులోకి వచ్చాయని, రైతులు ఉపయోగించుకోవాలని సుల్తానాబాద్ మండలం సుద్దాల పీఏసీఎస్​చైర్మన్ గడ్డం మహిపాల్ రెడ్డి అన్నారు. సుద్దాలలో శుక్రవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ మినుపాల స్వరూప, వైస్ చైర్మన్ మినుపాల ఢిల్లేశ్వర్ రావు, సర్పంచ్ అంజలి, ఎంపీటీసీలు రాజమణి, నిర్మల, మానిటరింగ్ ఆఫీసర్ స్రవంతి పాల్గొన్నారు.

రైతుల సహకారంతో అభివృద్ధి 

రైతుల సహకారంతోనే సొసైటీ అభివృద్ధి పథంలో నడుస్తోందని సుల్తానాబాద్ మండలం కనుకుల పీఏసీఎస్​చైర్ పర్సన్ కోట వీణ అన్నారు. కనుకులలో శుక్రవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. రానున్న రోజుల్లో రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్  వెంకట రామిరెడ్డి, సీఈవో శంకర్ గౌడ్, మానిటరింగ్ అధికారి జి. శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఎలగందల్​ ఖిలాలో బతుకమ్మ ఆట

కొత్తపల్లి, వెలుగు: మండలంలోని ఎలగందల్​ ఖిలాలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ పాటలతో సంప్రదాయ బద్ధంగా డ్యాన్సులు చేశారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు, అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పోతుగంటి సుజాతరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎలగందల్​ గ్రామ అధ్యక్షుడు రతన్, సామాజిక సేవకులు కాసం శైలజారెడ్డి, సునీత, అమ్ము స్వచ్ఛంద సంస్థ సభ్యులు సౌజన్య, కవిత, లక్ష్మి, వనజ, సుజాత, స్వప్న, సరిత, పద్మ  పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో బతుకమ్మ సంబరాలు

సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్లలోని జిల్లా కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా జడ్జిలు ప్రేమలత, సౌజన్య, శ్రీలేఖ, జడ్పీ చైర్ పర్సన్ అరుణ బతుకమ్మ ఆటలు ఆడారు.

సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన

చొప్పదండి,వెలుగు: సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనే మహిళలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ అన్నారు. శుక్రవారం సద్దుల బతుకమ్మ నిమజ్జనం చేసే కుడి చెరువు స్థలాన్ని కమిషనర్ శాంతి కుమార్​తో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి వెళ్లే దారిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నాయకులు ఇప్పనపల్లి సాంబయ్య, రామకృష్ణ, గంగయ్య పాల్గొన్నారు. 

సహకార సంఘాల్ని బలోపేతం చేయాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సహకార బ్యాంకుల  జాతీయ సమాఖ్య (నాఫ్కాబ్) అధ్యక్షుడు కొండూరి రవీందర్ రావు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులను కోరారు.  గురువారం  యూపీలోని లక్నోలో బ్యాంకర్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్‍ రూరల్ డెవలప్ మెంట్(నాబార్డ్)లో జరిగిన సమావేశంలో కొండూరి రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కఠినమైన సంస్కరణలు, సుపరిపాలన, ఐటీ వినియోగంతో కేడీసీసీ దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా అవతరించిందన్నారు.

దుబాయ్​లో బతుకమ్మ వేడుకలకు ఆహ్వానం

ఎల్లారెడ్డిపేట, వెలుగు: దుబాయ్ లో అక్టోబర్ 2 న నిర్వహించే బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కవితను ఈటీసీఏ అధ్యక్షుడు రాధరపు సత్యం అహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్​లోని కవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

మాట తప్పిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలె
16 గ్రామాల ప్రజల ధర్నా

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్​ జిల్లా గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మండలకేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యే రసమయి  బాలకిషన్  వెంటనే రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్​ చేశారు. శుక్రవారం యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని 16 గ్రామాల ప్రజలు తహసీల్దార్​ఆఫీస్​ఎదుట ధర్నా నిర్వహించారు. గన్నేరువరం బస్టాండ్ నుంచి తహసీల్దార్​ఆఫీస్​వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండ్లపల్లి రాజీవ్ రహదారి స్టేజ్ నుంచి పోత్తూరు వరకు  రోడ్డు అధ్వానంగా మారిందని, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదన్నారు. మండల కేంద్రానికి డబుల్ రోడ్డు వేసుడో.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాజీనామా చేసుడో.. నిర్ణయించుకోవాలని డిమాండ్ చేశారు.

మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన

మెట్ పల్లి, వెలుగు: మహిళా సంఘాలను  వేధిస్తున్న జగిత్యాల జిల్లా డీఆర్డీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి డిమాండ్​ చేశారు. శుక్రవారం మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న డబ్బులతో ప్యాడీ క్లీనర్లు కొనుగోలు చేయాలని మహిళా సంఘాలను డీఆర్డీఏ ఆఫీసర్లు, వీవో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే జిల్లాలో 100 ప్యాడీ క్లీనర్లు ఉండగా కొత్తగా మరో 40 కొనుగోలు చేయాలని గ్రామ సమాఖ్య సంఘాలలో తీర్మానం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం  సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏవో కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బోనగిరి అమర్,  రమేశ్, జెర్రీ పోతుల జయంత్,  దేవయ్య,  ప్రభాకర్, సురేందర్,  రాములు, జమీల్ తదితరులు  పాల్గొన్నారు.

దుర్గదేవిని దర్శించుకున్న బీజేపీ నాయకులు 

జ్యోతినగర్,వెలుగు: ఎన్టీపీసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్​అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీటీఎస్​లో ప్రతిష్టించిన దుర్గదేవిని శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత దర్శించుకొని పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో అసోసియేషన్​సభ్యులు ఏబీసీ రెడ్డి, నారయణ పాల్గొన్నారు.

కోరుట్ల మున్సిపాల్టీకి స్వచ్ఛత లీగ్ అవార్డు 

కోరుట్ల, వెలుగు:  ఇండియన్ స్వచ్ఛత లీగ్  పోటీల్లో తెలంగాణ నుంచి స్పెషల్ కేటగిరిలో కోరుట్ల మున్సిపాలిటీ ఎంపికైంది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో  మినిస్టర్​​ఫర్​ స్టేట్స్​ హౌజింగ్​ అండ్​అర్బన్​అఫైర్స్​సెక్రటరీ మనోజ్​ జోషి , జాయింట్​సెక్రటరీ రూపా మిశ్రా చేతుల మీదుగా  అవార్డ్ ను మున్సిపల్ కమిషనర్ అయాజ్ అందుకున్నారు. దేశంలో 1850  పట్టణాలు పోటీ పడగా కోరుట్లకు ఈ అవార్డు లభించింది.

బిల్లులు ఇప్పించండి..ఎమ్మెల్యేను వేడుకున్న సర్పంచ్​లు 

మేడిపల్లి, వెలుగు: చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని, బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని మేడిపల్లి మండలంలోని సర్పంచ్​లు వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​బాబును వేడుకున్నారు. శుక్రవారం ఎంపీపీ ఉమాదేవి అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. కార్యక్రమనికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్​లు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులు రావడం లేదని, ఇప్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన క్రీడా ప్రాంగణాలను సకాలంలో పూర్తిచేసిన కూడా అధికారులు బిల్లులు ఇవ్వడం లేదని మన్నెగూడం సర్పంచ్ నరేశ్​రెడ్డి తెలిపారు. అనంతరం 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు, బతుకమ్మ చీరలను అందజేశారు.  కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హారిచారన్ రావు, తహసీల్దార్​బసీరుద్దీన్, ఇన్​చార్జి ఎంపీడీవో ఖయుమ్ పాల్గొన్నారు.

కోరుట్లలో 18 ప్రైవేటు హాస్పిటళ్లకు నోటీసులు 

కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని 45  ప్రైవేట్​ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు శుక్రవారం జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్​వో సమియోద్దిన్ తెలిపారు. వీటిల్లో 18 హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ డీఎంహెచ్​వో వెల్లడించారు.

చేనేత రంగాన్ని ఆదుకుంటాం

తంగళ్లపల్లి, వెలుగు: చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పవర్ లూమ్ అండ్ టెక్స్ టైల్స్ కార్పొరేషన్ చైర్మన్​గుడూరి ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం సారంపల్లిలోని టెక్స్ టైల్స్ పార్క్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టెక్స్ టైల్స్ పార్క్ లోని సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని ప్రవీణ్ హామీ ఇచ్చారు. అనంతరం ప్రవీణ్​ను టెక్స్ టైల్స్ పార్క్ అధ్యక్షుడు అనిల్ ఘనంగా సన్మానించారు. పార్క్ అడ్మినిస్ట్రేటర్ అశోక్ రావు, సాగర్, అసోసియేషన్ సభ్యులు, యజమానులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ శిథిలాల్లో రేషన్ కార్డులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్ ను కూల్చి వేస్తుంటే ఆ శిథిలాల్లో పంపిణీ చేయని రేషన్ కార్డులు బయటపడ్డాయి. కరీంనగర్ కలెక్టరేట్ స్థానంలో కొత్త కలెక్టరేట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం గతంలో ఉన్న పాత కలెక్టరేట్ ను కూల్చివేస్తున్నారు. కూల్చివేత సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ  పంపిణీ చేయని కార్డులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు ముద్రించిన జగిత్యాల ప్రాంతంలోని వివిధ మండలాలకు చెందిన కార్డులు అవి. జిల్లాలో ఇలాంటి కార్డులు ఎక్కడా పంపిణీ చేయకపోయినా.. ముద్రించి ఇంతకాలం కలెక్టరేట్​లోనే అధికారులు   భద్రపరిచారు. ఈటల రాజేందర్ పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు ముద్రించారనడానికి గుర్తుగా  కార్డుపై ఆయన ఫొటోలు ఉండటం విశేషం. ఓ వైపు సీఎం కేసీఆర్.. మరో వైపు ఈటల బొమ్మలు ఉన్నాయి.   ఈ కార్డులు  శిథిలాల్లో మట్టి కొట్టుకుపోయి.. పరిసరాల్లో కనిపిస్తున్నాయి. 

బతుకమ్మ, దసరా ఏర్పాట్లకు రూ.19లక్షలు

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మున్సిపాలిటీలో బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లకు మున్సిపల్​కౌన్సిల్​ఆమోదం తెలిపింది. శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీలో మున్సిపల్​ చైర్మన్​ తక్కల్లపల్లి రాజేశ్వర్​రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని జమ్మికుంట, ఆబాది జమ్మికుంట, నాయిని చెరువు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, హౌసింగ్​ బోర్డు కాలనీ, కొత్తపల్లి, రామన్నపల్లి, ధర్మారం... తదితర 14చోట్ల మహిళలు బతుకమ్మలు ఆడుకోవడానికి ప్లడ్​లైట్స్​, విద్యుత్​ దీపాల అలంకరణలు ఏర్పాట్లు చేయనున్నారు. ఏర్పాట్లకు మున్సిపల్​ నిధుల నుంచి రూ.19లక్షలు కేటాయించినట్లు చైర్మన్​ రాజేశ్వర్​రావు తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్​బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో వైస్​ చైర్మన్​ దేశిని స్వప్న, కమిషనర్​కె సమ్మయ్య, మేనేజర్​ భూపాల్​ రెడ్డి, ఏఈ రాజేందర్​పాల్గొన్నారు. 

అమ్మవారికి 201 బోనాలు 

మల్లాపూర్ , వెలుగు:- శరన్నవరాత్రుల సందర్భంగా మల్లాపూర్​మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి 201బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ సరోజన, ఎంపీటీసీ రాజేశ్​, ఎస్సై నవీన్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలి 
చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంపత్

సుల్తానాబాద్, వెలుగు: పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు వస్త్రాల ఉత్పత్తికి ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి. సంపత్ అన్నారు. సుల్తానాబాద్ మండలం కనుకులలో శుక్రవారం జరిగిన శ్రీ వేంకటేశ్వర చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం మహాసభకు చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంచడం కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంఘం చైర్ పర్సన్ భోగ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు వై.శ్రీకాంత్ రెడ్డి, అన్విత, టెస్కో డీఎంవో జనార్ధన్, సర్పంచ్ అంజయ్య, మేనేజర్ రాములు, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు యాదగిరి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ట్రస్ట్ 
డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి

ధర్మపురి, వెలుగు: రాబోయే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎల్ఎం కొప్పుల పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్   ఆరోపించారు. ధర్మపురి పట్టణంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ పేరుతో అధికార దుర్వినియోగం చేస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారన్నారు. ట్రస్ట్ పేరిట కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్న మంత్రి తన ఆస్తుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మండలాధ్యక్షుడు సంగనబట్ల దినేశ్, రాజేశ్​ పాల్గొన్నారు.

బైపాస్ పనులు వెంటనే కంప్లీట్ చేయాలి
కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: -వెంకటపూర్- నుంచి  రగుడు బైపాస్ నిర్మాణ పనులను వెంటనే కంప్లీట్ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో ఆర్అండ్ బీ ఇంజినీర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రగుడు - ఎల్లమ్మ జంక్షన్ బైపాస్ విస్తరణ, అభివృద్ధి పనులు నవంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు. కొదురుపాక , వెంకట్రావు పల్లి, రాళ్ల పేట, ఎల్లారెడ్డి పేట రోడ్ విస్తరణ, అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న 8 బీటీ రెన్యూవల్​పనులకు సంబంధించి కాంట్రాక్టర్​తో అగ్రిమెంట్ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించాలన్నారు. ఎల్లారెడ్డిపేట–- మరిమడ్ల గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న నాలుగు బ్రిడ్జి పనులను స్పీడప్ చేయాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని పనులను అగ్రిమెంట్ ప్రకారం వేగంగా పూర్తి కంప్లీట్ చేయాలన్నారు. సమావేశంలో అర్అండ్ బీ ఈఈ కిషన్, డీఈఈలు, ఏఈఈ లు పాల్గొన్నారు.

హంస వాహనంపై ఉత్సవమూర్తుల ఊరేగింపు

వేములవాడ, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు  స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ పార్వతి  రాజరాజేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఊరేగించారు.  కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్​, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ ఏనుగు మనోహర్​ రెడ్డి, ఆలయ ఉద్యోగులు  పాల్గొన్నారు.

గాదరి కిషోర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

తంగళ్లపల్లి,వెలుగు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ లీడర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో గాదరి కిషోర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జనాల్లో బీఎస్పీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి నీచపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ప్రవీణ్​ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మధుకర్ , మండల ఉపాధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి నర్సింహులు, ట్రెజరర్​ఎడ్ల రాజు, కిషన్  పాల్గొన్నారు.