ఇయ్యాల తెలంగాణకు ప్రధాని మోదీ

ఇయ్యాల తెలంగాణకు ప్రధాని మోదీ
  •  రెండ్రోజుల టూర్​కు రానున్న ప్రధాని 
  • ఆదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటన 
  • వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 
  • ఆదిలాబాద్​లో ప్రధానికి స్వాగతం పలుకనున్న గవర్నర్​, సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి రానున్నారు. ఆయన సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 4 నుంచి 6 వరకు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అందులో పేర్కొంది. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్​లో మోదీ పర్యటిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు తమిళనాడు వెళ్తారు. మళ్లీ మంగళవారం తిరిగి తెలంగాణకు చేరుకుంటారు. ఆరోజు హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒడిశాకు వెళ్తారు. ఇక బుధవారం పశ్చిమబెంగాల్, బిహార్​లో పర్యటిస్తారు. 

ఆదిలాబాద్​లో సభ.. 

ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రూ.56 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రాష్ట్రంలోని పెద్దపల్లిలో ఎన్టీపీసీకి చెందిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును, విద్యుదీకరించిన అంబారి–ఆదిలాబాద్–పింపల్ ఖుతి రైలు మార్గాన్ని జాతికి అంకితమిస్తారు. ఎన్ హెచ్ 353బీ, ఎన్ హెచ్–163 ద్వారా తెలంగాణను మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ తో కలిపే రెండు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. 

హైదరాబాద్​లో సీఏఆర్ఓ ప్రారంభోత్సవం.. 

హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఏఆర్ఓ) కేంద్రాన్ని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. పౌర విమానయాన రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. దీన్ని రూ.350 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. 

సంగారెడ్డి టూర్​లో.. 

ప్రధాని మోదీ మంగళవారం సంగారెడ్డి వేదికగా వివిధ రంగాలకు సంబంధించిన రూ.6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఎన్ హెచ్–161లో కంది–రాంసాన్ పల్లి (40 కి.మీ) సెక్షన్ వరకు నాలుగు లేన్ల ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇండోర్–హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మధ్య రవాణా సులభతరం కానుంది. ఈ సెక్షన్ వల్ల హైదరాబాద్–నాందేడ్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు తగ్గుతుంది. 

అలాగే ఎన్ హెచ్-167లో మిర్యాలగూడ–కోదాడ (47 కి.మీ) సెక్షన్ వరకు రెండు లేన్ల ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఎన్ హెచ్ -65లో పుణె–హైదరాబాద్ (29 కి.మీ) సెక్షన్ ను ఆరు లేన్లుగా మార్చేందుకు చేపట్టే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మౌలాలీ–సనత్ నగర్ ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రూట్ ను ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో నిర్మించారు. ఇందులో భాగంగా ఫిరోజ్ గూడ, సుచిత్ర సెంటర్, భూదేవినగర్, అమ్ముగూడ, నేరేడ్ మెట్, మౌలాలీ హౌసింగ్ బోర్డులో కొత్త స్టేషన్లు రానున్నాయి. 

ఇండియన్ ఆయిల్ పారాదీప్–హైదరాబాద్ ప్రొడక్ట్ పైప్ లైన్ (1,212 కి.మీ)ను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా హైదరాబాద్ లోని మల్కాపూర్ వరకు పెట్రోలియం ఉత్పత్తులను సప్లై చేయడానికి ఈ పైప్ లైన్ ఉపయోగపడుతుంది.

స్వాగతం పలకనున్న గవర్నర్​, సీఎం

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్​ తమిళిసైతోపాటు సీఎం రేవంత్​రెడ్డి స్వాగతం పలుకనున్నారు. సోమవారం మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని విమనాశ్రయ మైదానానికి ప్రధాని చేరుకుంటారు. ముందుగా జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో రూ. 491 కోట్లతో మహారాష్ట్ర నుంచి బేల వరకు నిర్వహించనున్న నేషనల్ హైవే 353బి రహదారి విస్తరణ, రూ. 136 కోట్లతో హైదరాబాద్ టు భూపాలపట్నం వరకు నేషనల్ హైవే 63 రహదారి నిర్మాణానికి శుంకు స్థాపన చేయనున్నారు.