
దుబాయ్: ఐపీఎల్‌లో రెండు బలమైన జట్లు అమీతుమీకి రెడీ అయ్యాయి. దుబాయ్ వేదికగా సోమవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడిన ఇరుజట్లు తలా మూడు విక్టరీలతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌ల్లో ఉన్నాయి . కోల్‌కతాతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో శ్రేయస్ ఢిల్లీని ముందుండి నడిపిస్తే.. రాజస్తాన్‌తో జరిగిన పోరులో విరాట్ అదే పని చేశాడు. లీగ్ మొదలైనప్పటి నుంచి శ్రేయస్ మంచి ఫామ్‌లోనే ఉండగా.. రాజస్తాన్‌పై హాఫ్ సెంచరీ చేసి విరాట్ టచ్‌లోకి వచ్చాడు. బలాబలాల విషయానికికొస్తే ధవన్ ఫామ్ తప్ప ఢిల్లీకి బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యల్లేవు. రిషబ్‌పంత్ కూడా గాడిలోపడగా హెట్‌మెయిర్, స్టోయినిస్ మరింత రా ణించాల్సి ఉంది. బౌలింగ్‌లో రబడ ప్రధాన ఆయుధం కాగా నోర్జ్ సత్తా చాటుతుండడం ఢిల్లీకి ప్లస్ అవుతుంది. కేకేఆర్‌పై అదరగొట్టిన హర్షల్ పటేల్‌కు మరో చాన్స్ దొరకవచ్చు. అశ్విన్, అమిత్ మిశ్రా కీలకం కానున్నారు. బెంగళూరు విషయానికొస్తే కెప్టెన్ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టు సమస్యలన్నీ దాదాపు తీరినట్టే కనిపిస్తున్నాయి. ఫించ్, పడిక్కల్ , డివిలియర్స్ సత్తా చూపెడుతుండగా.. మిడిలార్డర్‌లో మాత్రం కొన్ని సమస్యలున్నాయి. బౌలింగ్‌లో చహల్ టాప్ ఫామ్‌లో ఉండగా.. ఉడానా, సైనీ, వాషింగ్టన్ సుందర్. జంపా తదితరులతో లైనప్ బలంగా కనిపిస్తోంది.