హ్యాపీ బర్త్ డే మహేశ్:  23 ఏళ్లైనా అతడి క్రేజ్ తగ్గలే...

హ్యాపీ బర్త్ డే మహేశ్:  23 ఏళ్లైనా అతడి క్రేజ్ తగ్గలే...

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అనే డైలాగ్ గుర్తుకు రాగానే హీరో మహేష్ బాబు గుర్తుకు వస్తాడు. ఈ ఒక్క డైలాగ్ తో అప్పట్లో పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి ఎన్నో డైలాగ్స్, హిట్ సినిమాలతో టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు  47వ బర్త్ డే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యాన్స్ ఘనంగా వేడుకలు చేస్తున్నారు. భారీ స్థాయిలో కేక్ కట్టింగ్స్ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బర్త్ డేకి సూపర్ స్టార్ మహేష్ 2006లో నటించిన పోకిరి మూవీ ని ప్రస్తుతం 4కె వర్షన్ లో రీప్రింట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300  షోలతో పోకిరి ప్రదర్శింపబడుతోంది. 16 ఏళ్ల కిందట వచ్చిన పోకిరి మూవీ భారీ క్రేజ్ తో దుసుకెళ్తుందంటే దానికి సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. 

మహేష్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అన్ని కూడా హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాష్ టాగ్ లతో ట్రేండింగ్ లో దూసుకెళ్తున్నాయి. ‘రాజకుమారుడు’ సినిమాతో  హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబును.. ఆ మూవీతోనే ప్రిన్స్ అని పిలవడం మొదలుపెట్టారు. యువరాజు, మురారి, పోకిరి, అతడు సినిమాలు అతడిని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. దీంతో మహేశ్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పటి నుంచి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ మహేశ్ దూసుకుపోతున్నాడు. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 

అటు నిజ జీవితంలోనూ భార్య నమ్రత ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడీ రియల్ హీరో. తెలుగు రాష్ట్రాల్లో 2 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి అండగా నిలిచి మంచి మనసున్న మనిషిగా పేరు సంపాదించాడు. తమ అభిమాన హీరో బర్త్ డే రోజున  రక్తదానం, హెల్త్ క్యాంపులు, అన్నదానం, అనాధ పిల్లలు.. వృద్ధులకు దుస్తులు, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలతో మహేశ్ ఫ్యాన్స్ తమ హీరోకి తగ్గ ఫ్యాన్స్ గా నిరూపించుకుంటున్నకారు. ఇక ప్రిన్స్ చెప్పాలంటే కాంట్రవర్సికీ చాలా దూరం. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు. షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికితే చాలు హాలిడే ట్రిప్ లో కనిపిస్తాడు. భార్యపిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ప్రస్తుతం హీరోగా ఒక్కో సినిమాతో ఒక్కో భారీ సక్సెస్ ని అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్లడంతో పాటు.. హీరోగా కోట్లాది ప్రేక్షకాభిమానుల హృదయాల్లో గొప్ప పేరు దక్కించుకున్నాడు.  ఇప్పటికే కెరీర్ పరంగా ఇటీవల సర్కారు వారి పాట మూవీ సూపర్ సక్సెస్ తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి లతో వరుసగా సినిమాలు చేయనున్నాడు. ఈ క్రమంలో అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతూ... మరొక్కసారి హ్యాపీ బర్త్ డే మహేశ్.