ఇయ్యాల గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ

ఇయ్యాల గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ

గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫైనల్ కీ మంగళవారం విడుదల కానున్న ది. పరీక్షలో పలు క్వశ్చన్లు తప్పుగా వచ్చినట్టు గుర్తించిన టీఎస్‌‌పీఎస్సీ అధికారులు.. ఆయా ప్రశ్నలను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫైనల్ కీ మంగళవారం విడుదల కానుంది. పరీక్షలో పలు క్వశ్చన్లు తప్పుగా వచ్చినట్టు గుర్తించిన టీఎస్‌‌పీఎస్సీ అధికారులు.. ఆయా ప్రశ్నలకు మార్కులు కలపొద్దని, వాటిని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో క్వశ్చన్ల సంఖ్యతో పాటు మార్కులు కూడా తగ్గనున్నాయి. అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, 2,86,051 మంది హాజరయ్యారు. ప్రిలిమినరీ కీని అక్టోబర్ 29న రిలీజ్ చేశారు. ఈనెల 4 దాకా అభ్యంతరాలను స్వీకరించారు. వచ్చిన అబ్జెక్షన్స్‌‌పై ఎక్స్ పర్ట్ కమిటీతో ఎగ్జామిన్ చేయించారు. ఈ ప్రక్రియ పూర్తికావడంతో మంగళవారం ఫైనల్ కీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

మెరిట్ లిస్టుకు మరింత టైమ్

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ రిలీజ్ చేసినా.. మెరిట్ లిస్టును మాత్రం టీఎస్‌‌పీఎస్సీ రిలీజ్ చేయట్లేదు. ప్రిలిమ్స్ నుంచి ఒక్కో కేటగిరీలో 1:50 చొప్పున మెయిన్స్‌‌కు ఎంపిక చేయాల్సి ఉంది. హారిజంటల్ ఇష్యూపై కోర్టు కేసు ఉండటంతో.. ఫైనల్ కీ మాత్రమే విడుదల చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. వారం, పదిరోజుల్లో హారిజంటల్‌‌ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముందని టీఎస్‌‌పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి.