ఎరువులు, ఆహారధాన్యాల సప్లై చైన్ ను కాపాడుకోవాలె : ప్రధాని మోడీ

ఎరువులు, ఆహారధాన్యాల సప్లై చైన్ ను కాపాడుకోవాలె  : ప్రధాని మోడీ
  • జీ20 సదస్సులో ప్రధాని మోడీ హెచ్చరిక 
  • ఇంధన సరఫరాపై ఆంక్షలు పెట్టొద్దు 
  • ప్రపంచ శాంతికి సమష్టిగా కృషిచేయాలని పిలుపు 

ఇండోనేషియాలోని బాలిలో మంగళవారం ప్రారంభమైన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ‘ఆహార, ఇంధన భద్రత’ అంశంపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఆహార ధాన్యాల సప్లై చైన్ స్థిరంగా కొనసాగాల్సిన అవసరం ఉందని, ఇయ్యాల్టి ఎరువుల కొరత.. రేపటి ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చని హెచ్చరించారు. జీ20 సదస్సులో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఆత్మీయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇరుదేశాల మధ్య పలు అంశాల్లో సహకారంపై చర్చించుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, మోడీ కూడా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. డిన్నర్ సందర్భంగా మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కూడా పలకరించుకున్నారు.
    
బాలి(ఇండోనేషియా) : ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఆహార ధాన్యాల సప్లై చైన్ స్థిరంగా కొనసాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇయ్యాల్టి ఎరువుల కొరత.. రేపటి ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చని జీ20 దేశాల అధినేతలను ఆయన హెచ్చరించారు. ఇండోనేషియాలోని బాలిలో మంగళవారం ప్రారంభమైన17వ జీ20 సదస్సులో ‘ఆహార, ఇంధన భద్రత’ అంశంపై మోడీ మాట్లాడారు. వాతావరణ మార్పు, కరోనా విపత్తు, ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ప్రపంచంలో గందరగోళం ఏర్పడిందని, ఫలితంగా గ్లోబల్ సప్లై చైన్ లు దెబ్బ తిన్నాయని అన్నారు. కరోనా విపత్తు సమయంలో ఇండియా130 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించడమే కాకుండా.. అనేక దేశాలకు ఆహార ధాన్యాలను కూడా అందించిందన్నారు.

‘‘రేపు ప్రపంచానికి ఆహార సంక్షోభం ఎదురైతే సమస్య నుంచి బయటపడేందుకు సరైన పరిష్కారం కూడా లేదు. అందుకే ఎరువులు, ఆహార ధాన్యాల సప్లై చైన్ సజావుగా సాగేందుకు మనమంతా ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ కు రావాలి. ఇండియాలో ఆహార భద్రత కోసం మేం సహజసిద్ధ వ్యవసాయాన్ని, పోషక విలువలు అత్యధికంగా ఉండే చిరు ధాన్యాలు వంటి సంప్రదాయ పంటలను ప్రోత్సహిస్తున్నాం. ఈ పంటలతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి నివారణతో పాటు పౌష్టికాహార లోపాన్ని కూడా నివారించవచ్చు. అందుకే వచ్చే ఏడాది మనం అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి” అని మోడీ పిలుపునిచ్చారు. 

ఇంధనంపై ఆంక్షలు వద్దు 

ఇండియా ఆర్థిక వ్యవస్థ అతివేగంగా అభివృద్ధి చెందుతున్నందున, దేశ ఇంధన భద్రత ప్రపంచ ఎకానమీ వృద్ధికి కూడా చాలా ముఖ్యమని మోడీ చెప్పారు. ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలనూ ప్రోత్సహించరాదని, ఎనర్జీ మార్కెట్ లో స్థిరత్వం ఉండేలా చూడాలన్నారు. రష్యా నుంచి భారీ సబ్సిడీపై ఆయిల్, గ్యాస్​ను ఇండియా దిగుమతి చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మోడీ పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాగా, ఉక్రెయిన్, రష్యా వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, తిరిగి దౌత్య విధానంలో చర్చలకు ముందుకు రావాలని సూచించారు. ప్రపంచ శాంతికి సమష్టిగా కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 

ఇండోనేషియాకు అండగా ఉన్నాం

జీ20 సదస్సు సందర్భంగా బాలిలో అక్కడి ఇండియన్ సంతతి ప్రజలతో మోడీ సమావేశమయ్యారు. మోడీకి వారు డ్రమ్స్ వాయిస్తూ, భారత్ మాతా కీ జై నినాదాలతో హోరెత్తిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని కూడా ఉత్సాహంతో వారితో కలిసి డ్రమ్స్ వాయించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండోనేషియాకు ఇండియా ఎల్లప్పుడూ అండగా నిలిచిందన్నారు.  

ఖేర్సన్ విజయం పెద్ద మలుపు: జెలెన్ స్కీ  

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఈ సదస్సులో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనుదిరగడం విజయం దిశగా తమకు టర్నింగ్ పాయింట్ అని అభిప్రాయపడ్డారు. యుద్ధం ఆపేసేలా రష్యాపై గట్టిగా ఒత్తిడి తేవాలని జీ20 దేశాల అధినేతలను కోరారు. 

ఢిల్లీలో18వ జీ20 సదస్సు   

జీ20 ప్రెసిడెన్సీని ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఇండియా చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీలో 18వ జీ20 సదస్సు జరగనుంది.

మోడీ, బైడెన్ అలయ్​ బలయ్​

జీ20 సదస్సులో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఆత్మీయత వెల్లివిరి సింది. ఇద్దరు నేతలూ పలుకరించుకుని, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ భేటీ అయి, ఇరుదేశాల మధ్య పలు అంశాల్లో సహకారంపై చర్చించు కున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, మోడీ కూడా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. డిన్నర్ సందర్భంగా మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కూడా ఒకరినొకరు పలకరించుకుని, ముచ్చటించారు. రెండేండ్ల కిందట లడఖ్​ గొడవ తర్వాత మోడీ, జిన్ పింగ్ పలకరించుకోవడం ఇదే తొలిసారి.