జపాన్లో 13 అంచెల స్క్రీనింగ్ తర్వాత గన్ లైసెన్స్..

జపాన్లో 13 అంచెల స్క్రీనింగ్ తర్వాత గన్ లైసెన్స్..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. ఆయనను హత్య చేసేందుకు దుండగుడు వినియోగించిన నాటు తుపాకీపై ఇప్పుడు వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ లో నాటు తుపాకీ వినియోగం ఎందుకు జరుగుతోంది ? అనే అంశంపై అందరి దృష్టి పడుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే.. జపాన్ లో అమలయ్యే జీరో టాలరెన్స్ తుపాకీ చట్టాల గురించి తెలుసుకోవాల్సిందే.

13 అంచెల స్క్రీనింగ్ తర్వాతే..
జీరో టాలరెన్స్ అంటే.. ఉపేక్షించక పోవడం. జపాన్లో  పోలీసులు, మిలిటరీకి తప్ప ఎవరికీ తుపాకీ ఉంచుకునే  హక్కు లేదు. ఒకవేళ ఎవరికైనా తుపాకీ లైసెన్స్ కావాలంటే.. 13 అంచెల స్క్రీనింగ్ ప్రక్రియ దాటాల్సి ఉంటుంది. గన్ లైసెన్స్ కోసం ఇంత పెద్ద ఎత్తున, ఇన్ని దశల్లో సుదీర్ఘ స్క్రీనింగ్ చేసే దేశం జపాన్ మాత్రమే. ఈ క్రమంలో గన్ లైసెన్స్ కావాలనుకునే వ్యక్తి.. గన్ షూటింగ్ టెస్ట్ లో 95 శాతం అక్యూరెసీ సాధించాలి. రాత పరీక్ష పూర్తి చేసుకొని, మెంటల్ హెల్త్ చెకప్ క్లియర్ చేసుకోవాలి. 13 అంచెల్లో ఇవన్నీ అధిగమిస్తేనే జపాన్ లో గన్ లైసెన్స్  చేతిలో పెడతారు. 

కాల పరిమితి  మూడేళ్లే..
గన్ లైసెన్స్ ఇచ్చే ముందు.. సదరు వ్యక్తి నేపథ్యం, కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు సేకరిస్తారు. ఇంత ప్రక్రియ పూర్తయ్యాక ఇచ్చే గన్ లైసెన్స్ కాల పరిమితి కేవలం మూడేళ్లు మాత్రమే. జపాన్ లో క్రైమ్ రేటు చాలా తక్కువ. అందుకు ముఖ్య కారణాల్లో ఒకటి.. గన్ లైసెన్స్ జారీ ప్రక్రియలోని అత్యంత క్లిష్టత. తుపాకులను వినియోగించి జరిగే నేరాలు జపాన్లో చాలా తక్కువ. ఒకవేళ ఎవరికైనా గన్ లైసెన్స్ కేటాయించినా.. అతడు చనిపోయాక గన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అలా పౌరుల వద్ద తుపాకులు లేకుండా చేస్తారు. 

ఎయిర్ గన్స్ అనుమతులు కష్టమే..
ఎయిర్ గన్స్ వినియోగానికి, వాటిని ఉంచుకోవడానికి మాత్రమే పరిమిత అనుమతులు ఇస్తారు. వాటిని కూడా ఎందుకు వినియోగిస్తారు? ఎక్కడ వినియోగిస్తారు ? అనేది చెప్పి, దర్యాప్తు అధికారులకు ఒప్పించాలి. అప్పుడే ఆ ఎయిర్ గన్స్ ను  నిర్ణీత కాల పరిమితి కోసం వాడుకునే అవకాశమిస్తారు.