ఇరవై ఐదేళ్ల తన సినీ ప్రయాణం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్న ఆయన.. ‘పొట్టేల్’ చిత్రంలో పవర్‌ఫుల్ రోల్ చేశాడు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అజయ్ చెప్పిన విశేషాలు.
‘‘పాప ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసే తండ్రి కథ ఇది. మూఢనమ్మకాలు, వాటిని అడ్డం పెట్టుకుని బతికే మనుషులు, మొండితనం గురించి, గ్రామదేవతల గురించి.. ఇలా మల్టీ లేయర్స్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి కథలు చెప్పినప్పుడు కొన్నిసార్లు సందేశం ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా సాహిత్ తీర్చిదిద్దాడు.
ఇందులో నేను పోషించిన పటేల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తా. నటుడికి ప్రతి సినిమా ఒక డిస్కవరీలాగానే ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కల్చర్‌ని ప్రెజెంట్ చేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. తెలంగాణలో సిగం అని ఉంటుంది. సిగం అంటే దేవుడు రావడం అంటారు. అలాంటి పాత్రలో కనిపించడం కోసం చాలా ఎఫర్ట్ పెట్టా.
ఈ పాత్ర నన్ను బాగా ఎక్సయిట్ చేసింది. ‘విక్రమార్కుడు’ చిత్రంలోని టిట్ల క్యారెక్టర్ తరహాలో పటేల్ పాత్ర కూడాఅందరికీ గుర్తుండిపోతుంది. చాలా రోజుల తర్వాత నటుడిగా నాకు హ్యాపీనెస్ ఇచ్చిన రోల్ ఇది. నాతోపాటు యువ చంద్ర, అనన్య సహా మిగతా పాత్రలన్నీ బాగా పండాయి. ఇక ప్రస్తుతం అజయ్ దేవగన్ గారితో ‘సింగం ఎగైన్’ చేశాను. అలాగే ‘పుష్ప 2’తో పాటు ఓ రీమేక్ మూవీ జరుగుతోంది. అలాగే తమిళ, మలయాళ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి’’.