హైదరాబాద్: సినీ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల సమావేశానికి హాజరైన మంత్రి.. సినిమా షూటింగ్ ల ప్రారంభం, టాలీవుడ్ సమస్యలు, షూటింగ్ ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని ..వాటికి వెంటనే అనుమతి ఇస్తామని తెలిపారు.
చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా దాదాపు 14వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారని..ప్రభుత్వం కూడా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. షూటింగ్ లకు అనుమతులపై సీఎం కేసీఆర్ తో చర్చించాకే ఫైనల్ నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
చిరంజీవి మాట్లాడుతూ.. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడంతో.. టాలీవుడ్ లోనూ అనుమతులు ఇవ్వాలని..సినీ పరిశ్రమ పరిస్థితులపై మంత్రి తలసానికి తెలియజేశామన్నారు. అలాగే థియేటర్లు ఫున:ప్రారంభం, సినిమాల రిలీజ్ లకు త్వరగా అనుమతులు కావాలని చెప్పినట్లు వివరించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి, కొరటాల శివ, సి.కల్యాణ్, జెమిని కిరణ్, స్రవంతి రవికిషోర్ , వినాయక్, త్రివిక్రమ్, ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

