టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కన్నుమూత

 టాలీవుడ్ ఫేమస్  డైరెక్టర్ కన్నుమూత

టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కే.వాసు కన్నుమూశారు. హైదరాబాద్  ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మే 26వ తేదీ సాయంత్రం చనిపోయారు. 

ప్రాణం ఖరీదు, కోతల రాయుడు, తోడు దొంగలు, అల్లుళ్లొస్తున్నారు, పల్లెటూరి పెళ్లాం  వంటి  చిత్రాలకు కే వాసు దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవిని కే.వాసునే టాలీవుడ్ కు పరిచయం చేశారు.  కె.వాసు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

కే.వాసు తండ్రి ప్రత్యగాత్మ ఆయన సోదరుడు హేమాంబరధరరావు ఇద్దరూ కూడా దర్శకులే. టాలీవుడ్లో ఎన్నో మంచి సినిమాలను వీరు రూపొందించారు. తండ్రి, బాబాయ్ బాటలో నడిచిన వాసు కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రాణం ఖరీదు సినిమా  కే.వాసుకు మంచి పేరు తీసుకొచ్చింది. విజయ చందర్ శిరిడి సాయిబాబా పాత్రలో తెరకెక్కించిన ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, వాసు  కెరీర్‌లో మలుపు అని చెప్పొచ్చు. 

వీటితో పాటు  గోపాల్ రావు గారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి,గువ్వల జంట,కలహాల కాపురం, దేవుడు మావయ్య, డామిట్ కథ అడ్డం తిరిగింది, బాబులు గాడి దెబ్బ, పుట్టినిల్లా మెట్టినిల్లా, రేపటి రౌడి, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం,  సుమన్‌తో అమెరికా అల్లుడు, చిన్న కోడలు, బ్రహ్మానందం తొలిసారి హీరోగా నటించిన ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ వంటి చిత్రాలకు కే వాసు దర్శకత్వం వహించారు.  శ్రీకాంత్, ప్రభుదేవాలతో పక్కింటి అమ్మాయి  చిత్రాన్ని  ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ గా రీమేక్ చేసి సూపర్హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘గజిబిజి’తో సినిమాలను డైరెక్ట్ చేశారు.చివరగా ఈయన పోసాని కృష్ణ మురళితో ‘తింగరోడు’ సినిమాను తెరకెక్కించారు.