డ్రగ్స్ కేసులో ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ

డ్రగ్స్ కేసులో ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈడీ విచారణ ముగిసింది. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా దాదాపు 10 గంటల పాటు విచారణ కొనసాగింది. సుదీర్ఘ విచారణలో ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ ను మనీ లాండరింగ్‌ చట్టం కింద వివిధ లావాదేవీలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ లావాదేవీలు చూసే చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీధర్‌ని కూడా ఈడీ అధికారులు విచారించడంతో ఆర్ధిక లావాదేవీల విషయంపై విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఈడీ సుదీర్ఘ విచారణ ముగించుకుని ఆయన కొద్దిసేపటి క్రితం కుమారుడు ఆకాష్‌, ఆడిటర్‌ తో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు.
పూరి కోసం ఈడీ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్
డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ ను ఈడీ విచారిస్తున్న సమయంలో నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్‌ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తనను కలసిన మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడుతూ  పూరీ జగన్నాథ్ ను కలిసేందుకే వచ్చానని వెల్లడించారు. పూరి దర్శకత్వంలో  బండ్ల గణేష్‌ నిర్మాతగా రెండు సినిమాలు తెరకెక్కించారు. ఈడీ తనను విచారిస్తున్న సమయంలో బండ్ల గణేష్‌ పేరును పూరి ప్రస్తావించడంతో నిర్దారించుకునేందుకే బండ్ల గణేష్‌ను పిలిచి విచారించినట్లు ఊహాగానాలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం నమోదైన డ్రగ్స్ కేసు ఆధారంగా సినీ ప్రముఖుల విచారణ ఇవాళ మళ్లీ పునః ప్రారంభం అయింది. సినీ ప్రముఖుల విచారణ  సెప్టెంబర్ 22వ తేదీ వరకు కొనసాగనుంది. తాను కేవలం పూరికి మద్దతుగానే ఈడీ కార్యాలయానికి వచ్చానని, కేసుతో తనకు సంబంధం లేదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు.