రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. అసలేం జరిగిందంటే?

రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శీను వైట్ల దగాకు గురయ్యారు. సుమారు రూ. 7.2 కోట్ల మేర రియల్ ఎస్టేస్ట్ మోసానికి గురైన ఆయన న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. వెండితెరపై తమ మార్క్ తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు..  ఇలా నిజ జీవితంలో ఒక సీరియస్ రియల్ దగాకు గురవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..

అసలేం జరిగింది?

ఈ మోసం 2019లో మొదలైంది. వికారాబాద్ జిల్లాలోని కడ్మూర్ గ్రామంలో సుమారు 11.59 ఎకరాల వ్యవసాయ భూమి ఉందంటూ కొందరు వ్యక్తులు శీను వైట్లను సంప్రదించారు. ఇందులో ఆయన మేనకోడలు పి. శ్వేత కూడా భాగస్వామిగా ఉన్నారు. ఏడుగురు వ్యక్తులు, ఇద్దరు బ్రోకర్ల సాయంతో శీను వైట్ల నివాసానికి వచ్చి, ఆ భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను చూపించి నమ్మబలికారు. వారు చూపించిన డాక్యుమెంట్లు అన్నీ ఒరిజినల్‌గా అనిపించడంతో, శీను వైట్ల, ఆయన మేనకోడలు ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు.

హైకోర్టు ఆదేశాలతో వెలుగులోకి..

నమ్మకం కుదరడంతో, సుమారు రూ.7.2 కోట్లను చెక్కుల రూపంలో చెల్లించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదు సేల్ డీడ్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే, అసలు ట్విస్ట్ జూన్ 2025లో వెలుగులోకి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు వికారాబాద్ కలెక్టర్ సదరు భూమి యాజమాన్య హక్కులపై నోటీసులు జారీ చేయడంతో శీను వైట్ల అప్రమత్తమయ్యారు. తీరా ఆరా తీస్తే, తమకు భూమి అమ్మిన వ్యక్తులు అసలు యజమానులే కారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమను బురిడీ కొట్టించారని తేలింది.

పోలీసులకు ఫిర్యాదు..

దీంతో తమను మోసం చేసినట్లు గుర్తించిన శీను వైట్ల, హైదరాబాద్‌లోనిసెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతోంది. సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులే ఇలాంటి మోసాలకు గురవుతున్నారంటే, సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు పడ్డంత మాత్రాన భూమి సేఫ్ అని భావించలేం. కనీసం ఇద్దరు ముగ్గురు న్యాయవాదులతో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయించడం తప్పనిసరి న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.