వేతనాలు పెంచాలని 24 క్రాఫ్ట్స్ కార్మికుల ఆందోళన

వేతనాలు పెంచాలని 24 క్రాఫ్ట్స్ కార్మికుల ఆందోళన

టాలీవుడ్ లో సమ్మె సైరన్  మోగింది. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సినిమా బడ్జెట్ లు, హీరోల రెమ్యూనరేషన్స్ పెరుగుతున్నా.. తమ వేతనాలు అయితే పెరగడం లేదని సినీ కార్మికులు సమ్మెకు రెడీ అయ్యారు. ఇవాళ 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్  కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇవాళ్టి నుంచి సినిమా షూటింగ్ లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

కరోనా కారణంగా అన్నిరంగాల్లోనూ కార్మికులకు అవస్థలు తప్పలేదు. సినీ కార్మికులు కూడా గత కొంతకాలంగా గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమకు కనీస వేతనాన్ని అమలు చేయాలని గత కొంతకాలంగా నిర్మాతల్ని డిమాండ్ చేస్తున్నారు సినీకార్మికులు. ప్రతీ మూడేళ్లకోసారి వేతనాలు పెరగాలంటున్నారు సినీ కార్మికులు. కానీ నాలుగేళ్లైనా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినీ కార్మికులు.

సినీ కార్మికులు సమ్మెకు వెళ్లాలంటే పరిశ్రమలోని నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్ఛాంబర్కు నోటీసు ఇవ్వాలన్నారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు అందలేదని స్పష్టం చేశారు. కార్మికులు గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. నిర్మాతలు ఇవాళ సజావుగా షూటింగ్ లు నిర్వహించుకోవచ్చని సూచించారు. ఫిల్మ్  ఫెడరేషన్  నుంచి ఫిల్మ్  ఛాంబర్ కు ఎలాంటి లేఖ రాలేదని పేర్కొన్నారు. గత నెలలో కార్మిక సంఘాల్లోని స్టంట్  యూనియన్  ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షూటింగ్ లకు వెళ్లకపోవడంతో నిర్మాతలకు రూ.2కోట్ల నష్టం వాటిల్లిందన్నారు రామకృష్ణ. కార్మికుల వేతనాలపై నిర్మాతల మండలి, ఫిల్మ్  ఛాంబర్  కౌన్సిల్  భేటీలో చర్చిస్తామన్నారు.