టమాటా కిలో రూ. 2

టమాటా కిలో రూ. 2
  • రైతులపై కరోనా మహమ్మారి దెబ్బ
  • ఏటా ఈ సీజన్​లో క్వింటాల్ రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర
  • ఇప్పుడు రూ.200 నుంచి రూ.600 లోపే పలుకుతోంది
  • ట్రాన్స్​పోర్ట్, కూలీ ఖర్చులు పోను కిలోకు రూపాయి కూడా రావట్లే

హైదరాబాద్‌, వెలుగు: ఎండాకాలంలో ధర గిట్టుబాటైతదని టమాటా సాగుచేసిన రైతులను కరోనా మహమ్మారి నట్టేట ముంచుతోంది. యేటా ఈ సీజన్‌లో హోల్‌ సేల్‌ మార్కెట్‌లో కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలికేది. కానీ ఇప్పుడు హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధర రూ.2 నుంచి రూ.6 పలుకుతోంది. సీజన్‌లో ఉండాల్సిన ధరలో 90శాతం పడిపోవడంతో పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. కూలీల ఖర్చులు కూడా రావని టమాటా ఏరకుండా తోటల్లోనే వదిలేసే పరిస్థితి నెలకొంది.

మంగళవారం గుడిమల్కపూర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కి 2,158 క్వింటాళ్లు, బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ వెజిటెబుల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు 1,687 క్వింటాళ్ల లోడ్ల టమాటా రాగా ధర క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు కనిష్ట ధర రూ.200, మోడల్‌‌‌‌‌‌‌‌ ధర రూ.500, గరిష్టంగా రూ.600 పలికింది. సాధారణంగా ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.2000 నుంచి రూ.5200 వరకు ధర పలికేది. అంటే కిలో రూ.20 నుంచి రూ.52 ధర పలికేది. సీజన్‌‌‌‌‌‌‌‌ ధరలతో పోలిస్తే కనీసం పది శాతం కూడా ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రైతులకు  కిలో రూ.4 వరకు వస్తోంది. 25కిలోలు ఉండే ఒక్కో టమాటా బాక్స్‌‌‌‌‌‌‌‌కు రైతుకు ధర రూ.100 వస్తోంది. తోట నుంచి మార్కెట్‌‌‌‌‌‌‌‌ వరకు ట్రాన్స్‌‌పోర్ట్ కు ఒక్కో బాక్స్‌‌‌‌‌‌‌‌ రూ.30 చెల్లించాల్సి వస్తోంది. కూరగాయలు తెంపే కూలీలు, కాయల వారిగా గ్రేడింగ్‌‌‌‌‌‌‌‌, హమాలీ చార్జీలు కలిపి మరో రూ.30 కిలో ఇలా 25కిలో బాక్స్‌‌‌‌‌‌‌‌ మార్కెట్​లో అమ్మకానికి తెచ్చే వరకు రూ.60 ఖర్చు అవుతుండగా.. రూ.40 మాత్రమే మిగులుతోంది. పెట్టుబడి, ఖర్చులు పోను కిలోకు రూపాయి కూడా గిట్టుబాటు కావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

5 వేల మంది రైతులకు నష్టం
రాష్ట్రంలో వేసవిలో 500 ఎకరాలకు మించి సాగయ్యేది కాదు. దీంతో మే, జూన్‌‌‌‌‌‌‌‌ నెలల్లో టమాటా కిలో రేటు రూ.60కు పైగా పలికేది. కానీ షేడ్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌, మల్చింగ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీపై అవగాహన పెరగడంతో ఈ యాసంగిలో మొట్టమెదటి సారిగా 4,000 ఎకరాల్లో టమాటా సాగైంది. కొత్త పద్ధతుల్లో సాగు చేయడంతో దిగుబడి బాగా వచ్చింది. కరోనాతో ధర పడిపోవడంతో గిట్టుబాటైతదనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. దాదాపు 5 వేల మంది రైతులు నష్టపోయారు.

ప్రజలకు మాత్రం పిరమే
కిందటేడాది లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ టైమ్​లో టమాటా హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ ధర రూ.15 నుంచి రూ.18 వరకు పలికింది. ఈసారి మాత్రం రైతులకు నిరుటి ధరలో మూడో వంతు కూడా రావట్లేదు. లాక్​డౌన్ టైమ్​లో మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తరలించడం ఓ ఎత్తయితే 4గంటల్లోనే అమ్ముకోవాల్సిన రావడం మరోఎత్తవుతోంది. దీంతో వ్యాపారులు తక్కువ ధర పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతులు టమాటా వేసి నష్టపోతుంటే మరోవైపు వినియోగదారులకు మాత్రం తక్కువ ధరలో దొరకడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల రైతు బజార్లలో కిలో రూ.14 ధర పలుకుతుండగా బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వినియోగదారులకు రూ.15 నుంచి రూ.20 కొనాల్సి వస్తోంది.

వేసవిలో ధర అదుపులో ఉంది
యేటా వేసవిలో టమాటా సాగు తగ్గి ధరలు భారీగా పెరిగేవి. ఒక్కోసారి కిలో రూ.100 వరకు పలికేది. వేరే స్టేట్స్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. వేసవిలో టమాటా సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాం. దీంతో సంగారెడ్డి, మెదక్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో సాగు, దిగుబడి పెరిగి, వేసవిలోనూ ధర అందుబాటులోకి వచ్చింది. అయితే లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో రైతులకు ధర గిట్టుబాటు కావట్లేదని అంటున్నారు. 
- వెంకట్రాంరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌

గత మూడేళ్లలో మేనెలలో టమాటా హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ ధరలు
సంవత్సరం    కనిష్ట ధర     మోడల్‌‌‌‌‌‌‌‌ ధర    గరిష్ట ధర
2019    రూ.16    రూ.40    రూ.52
2020    రూ.12    రూ.15    రూ.18
2021    రూ.2       రూ.5     రూ.6