టమాట తోటలకు వైరస్​ దెబ్బ..పెద్ద సంఖ్యలో చనిపోతున్నమొక్కలు    

టమాట తోటలకు వైరస్​ దెబ్బ..పెద్ద సంఖ్యలో చనిపోతున్నమొక్కలు    
  • నష్టంతో లబోదిబోమంటున్న రైతులు

మెదక్​, శివ్వంపేట, వెలుగు: వైరస్ సోకి టమాట మొక్కలు చనిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. శివ్వంపేట, తూప్రాన్, మనోహరాబాద్​, చేగుంట, చిన్నశంకరంపేట, మాసాయిపేట మండలాల్లో  1,800 ఎకరాల్లో టమాటా సాగవుతోంది. యాసంగిలో వరి సాగు చేస్తే నీటి తడులు సరిపడ అందకుంటే ఇబ్బందవుతుందని ఎక్కువ మంది రైతులు టమాటా సాగు చేశారు.

కానీ కొద్ది రోజులుగా టమాట తోటలకు వైరస్​ సోకుతోంది. శివ్వంపేట మండలంలోని చెన్నాపూర్, పెద్దగొట్టిముక్ల, శివ్వంపేట, గోమారం, నవాపేట్, సికింద్లాపూర్, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, పోతులబొగడ, పాంబండ గ్రామాల్లో  రైతులు దాదాపు 200 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఇందులో సుమారు 60 ఎకరాల్లో వైరస్​ సోకింది.  దీంతో పెద్ద సంఖ్యలో మొక్కలు చనిపోతున్నాయి. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా వైరస్​ అదుపు కావడం లేదని రైతులు చెబుతున్నారు. లాభాల మాట అటుంచి పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

హార్టికల్చర్​ సిబ్బందిని ఫీల్డ్​కు పంపి టమాట తోటలను పరిశీలింపజేస్తాం. నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తాం. పంటను కాపాడే ప్రయత్నం  చేస్తాం.
నర్సయ్య, జిల్లా హార్టికల్చర్​ ఆఫీసర్​