రోజు రోజుకి పెరుగుతున్న టమాటా ధరలు

రోజు రోజుకి పెరుగుతున్న టమాటా ధరలు

టమాటా ధరలు  పెట్రోల్ రేట్లతో  పోటీ పడ్తున్నాయి. సాధారణంగా చలికాలంలో 20 రూపాయలకు కిలో ఉండాల్సిన టమాటాల  ధర హైదరాబాద్ లో  సెంచరీ దాటింది.  హోల్ సేల్  మార్కెట్ లో   100 నుంచి 110 రూపాయలు ఉండగా   బండ్లు, చిన్నచిన్న  షాపుల్లో  అంతకు మించి పలుకుతోంది. ఇటీవల కురిసిన  భారీ వర్షాలతో  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కర్ణాటకలోను  టమాటా కిలో వంద రూపాయలు దాటేసింది. చిత్తూరు జిల్లా   మదనపల్లె మార్కెట్ లో  150 రూపాయలు   దిశగా వెళ్తోంది. నిన్న ఇక్కడ రికార్డు స్థాయిలో   కేజీ ధర 130 రూపాయలు   పలికింది. చెన్నైలో ఈ నెల  ప్రారంభంలో  40 రూపాయలు ఉండగా  ఇప్పుడు 160 రూపాయలకు  చేరింది. వర్షాలతో టమాటాలతో పాటు  ఇతర కూరగాయలు ధరలు పెరిగాయి. 

నెల్లూరు, విజయవాడతో  పాటు   తమిళనాడుకు చిత్తూరు  జిల్లాలోని  మదనపల్లె, కలకడ, పలమనేరు ప్రాంతాల నుంచి,   కర్ణాటకలోని కోలారు  నుంచి టమాటాలు  ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు,  కడప, నెల్లూరు జిల్లాల్లో   రైతులు సాగు చేసిన   టమాటా పంట నాశనమైంది. మదనపల్లె  మార్కెట్ కు  తక్కువగా టమాటా  వస్తుండడంతో   డిమాండ్ పెరిగింది. టమాటా అధికంగా పండించే ప్రాంతాలు వర్ష  ప్రభావానికి   గురికావడంతో పాటు డీజిల్ రేట్లు కూడా పెరిగిపోవడం ధరలు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. 

మదనపల్లె ప్రాంతంలో దిగుబడి తగ్గడంతో ఇక్కడి ప్రజలకు ఛత్తీస్ గఢ్ టమాటానే దిక్కుగా మారనుంది. అలాగే మహారాష్ట్రలోని షోలాపూర్, కర్ణాటకలోని చిక్ బుల్లాపూర్ నుంచి వచ్చే సరుకుపైనా ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. ఏపీ సర్కారు ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్  నుంచి టమాటా దిగుమతి చేయించి, రైతు బజార్లలో విక్రయించాలని భావిస్తోంది.