
- ఎల్లుండి కన్నెపల్లి పంప్‌హౌస్ చూస్తం
- లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నానీళ్లెందుకు ఎత్తిపోయట్లేదు
- కాంగ్రెస్ ప్రభుత్వ స్కాంలపై అసెంబ్లీలో నిలదీస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలమంతా కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తమని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. గురువారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయ్యాక మేడిగడ్డకు బయల్దేరతామని చెప్పారు. శుక్రవారం కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శిస్తామని చెప్పారు. లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలో వృథాగా పోతున్నా రాష్ట్ర సర్కారు నీళ్లు ఎత్తిపోయడం లేదని విమర్శించారు. మిడ్‌మానేరు, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ నింపి రైతులకు నీళ్లిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మూడు గంటల పాటు సాగిన ఎల్పీ మీటింగ్‌లో పార్టీ చీఫ్ కేసీఆర్ అన్ని అంశాలపై తమకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
కాగా, ముందస్తు అనుమతితోనే కొందరు ఎమ్మెల్యేలు ఎల్పీ మీటింగ్‌కు హాజరు కాలేదన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదన చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలపై చర్చ కోసం బుధవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో పాల్పడిన స్కాంలపై నిలదీస్తామని తెలిపారు. పౌరసరఫరాల శాఖలో స్కాంలు జరిగాయని, వాటిపై గళమెత్తుతామని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాల వెనుక బండారాన్ని బయటపెడతామన్నారు.
8 ఎంపీ సీట్లిస్తే.. గాడిద గుడ్డే ఇచ్చారు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై అసెంబ్లీలో నిలదీస్తామని హరీశ్ రావు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ఎందుకు లేట్ చేస్తున్నారో ప్రశ్నిస్తామన్నారు. రైతు భరోసాను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తామన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తామన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లను ఇస్తే రాష్ట్రానికి వాళ్లు ఇచ్చింది గాడిద గుడ్డేనని విమర్శించారు. బడ్జెట్కేటాయింపుల్లో అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, చింత ప్రభాకర్, కోవా లక్ష్మి, విజేయుడు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.