ఐపీఎల్ అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తారు. నలుగురు విదేశీ క్రికెటర్లలో ఖచ్చితంగా ప్రతి జట్టులో ఇద్దరు క్రికెటర్లు ఉంటూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. అన్ని దేశాల ఆటగాళ్లతో పోలిస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారీ హైప్ ఉంటుంది. ఆసీస్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపిస్తారు. అయితే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు కొంతమంది స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిస్ అవుతున్నారు. డిసెంబర్ 16 నుంచి ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ప్రారంభం కానుంది. ఈ వేలానికి దూరమవుతున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియా:
గ్లెన్ మ్యాక్స్ వెల్: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ 2026 ఐపీఎల్లో ఆడటం లేదని ప్రకటించాడు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని మ్యాక్స్వెల్ ప్రకటించాడు. కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ఫామ్ కూడా అంత గొప్పగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈసారి వేలంలో తన పేరు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు మ్యాక్స్వెల్ సోషల్ మీడియా వేదికగా చెప్పేశాడు. 2024లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మ్యాక్స్ వెల్ను 4.2 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. గత సీజన్లో ఆరు ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్సీ 48 పరుగులు మాత్రమే ఘోరంగా విఫలమయ్యాడు.
వార్నర్:
ఐపీఎల్ లో డేవిడ్ వార్నర రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా టోర్నీలో వన్ ఆఫ్ ది ఆల్ టైం బెస్ట్ బ్యాటర్లలో వార్నర్ పేరు ఉంటుంది. ఐపీఎల్ లో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు 2016 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. చివరిసారిగా ఈ ఆసీస్ ఓపెనర్ 2024 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడాడు. 2025 మెగా ఆక్షన్ లో వార్నర్ ను ఒక్కరు కూడా కొనలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వార్నర్ పై ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో 2026 మినీ వేలానికి వార్నర్ ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు.
ALSO READ : ఐపీఎల్ 2026 మినీ వేలం.. టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, ఆటగాళ్ల కనీస ధర వివరాలు!
ఆడమ్ జాంపా:
ఆస్ట్రేలియా స్టార్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2026 సీజన్ కు దూరమవుతున్నాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ తరపున ఆడిన జంపా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వైట్ బాల్ స్పిన్నర్ గా పేరున్న జంపా ఐపీఎల్ లో బాగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. జంపా ఐపీఎల్ కు దూరమవడానికి గల కారణం తెలియాల్సి ఉంది.
ఆరోన్ హార్డీ:
ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ ఐపీఎల్ 2026కి దూరమవుతున్నాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ రూ.1.25 కోట్ల రూపాయలకు ఆరోన్ హార్డీని కొనుగోలు చేసింది. అయితే హార్డీకి ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం లభించలేదు. కారణం ఏదైనప్పటికీ హార్డీ 2026 ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ నలుగురుతో పాటు మాజీ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్, క్రిస్ గ్రీన్ ఐపీఎల్ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు అందుబాటులో లేరు.

