
గణపతి, మల్లోజుల, కటకం లొంగుబాటు!
త్వరలోనే సరెండర్ కానున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు
గణపతి భార్య, మల్లోజుల భార్య కూడా లొంగిపోయే చాన్స్
వీరందరూ ఢిల్లీలో అమిత్ షా ముందు సరెండర్ అవుతారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ లీకులు
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మరో నలుగురు కీలక నేతలు త్వరలోనే ప్రభుత్వానికి సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు మూడు రోజుల్లోనే కేంద్ర హోంశాఖ ఎదుట వీరు లొంగిపోనున్నట్లు సెంట్రల్ఇంటెలిజెన్స్ వర్గాలు లీకులు ఇస్తున్నాయి. గణపతితో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. గణపతి భార్య సుజాత, మల్లోజుల భార్య తారాబాయి కూడా సరెండర్ అవుతారని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిగా చేపట్టిన జాయింట్ఆపరేషన్ఇటీవలే కొలిక్కి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సరెండర్‌కు అంగీకరించిన మావోయిస్టు లీడర్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల కనుసన్నల్లోనే ఉన్నారని, త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోతారని తెలుస్తోంది. సాయుధ విప్లవంతో దేశమంతటా సవాలు విసిరిన మావోయిస్టు అగ్ర నేతలు కావడంతో కేంద్రమంత్రి ఎదుటనే సరెండర్ అయ్యే చాన్స్ ఉందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఏడాదిగా లొంగుబాటుకు ప్రయత్నాలు
జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి బంధువులతో పాటు అదే ప్రాంతానికి చెందిన ఒక ముఖ్య నేత ద్వారా ఏడాదిగా ఈ లొంగుబాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలే ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గణపతి వెంట లొంగిపోయే జాబితాలో పేర్లు వినిపిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి.. కిషన్ జీ తమ్ముడు. ఈయనతో పాటు కటకం సుదర్శన్సెంట్రల్ కమిటీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. వీరందరూ తెలంగాణకు చెందినవారే. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలో ఇంచుమించుగా ఒకే టైమ్‌లో చేరిన ఈ ముగ్గురూ.. 40 ఏండ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. కొండపల్లి తర్వాత పార్టీ బాధ్యతలు స్వీకరించి సెంట్రల్ కమిటీ చీఫ్‌గా ఉన్న గణపతి పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీ ఏర్పాటు వరకు సుదీర్ఘ కాలం చురుగ్గా పని చేశారు. రెండేండ్ల కిందట మావోయిస్టు పార్టీలో పెద్ద ఎత్తున నాయకత్వ మార్పులు జరిగాయి. 25 ఏండ్ల పాటు పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతి తన బాధ్యతలను శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి గణపతి కేవలం పార్టీకి సలహాదారుగా ఉంటున్నారు. దాదాపు 74 ఏండ్ల వయస్సున్న గణపతి వయోభారంతో పాటు అనారోగ్య కారణాలతోనే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అనారోగ్య సమస్యలతో పాటు సైద్ధాంతిక విభేదాలతోనే ఈ మార్పులు జరిగినట్లు పార్టీలో చర్చ జరిగింది.
లొంగిపోతే సహకరిస్తం
గణపతి లొంగుపోతున్నారని ప్రచారం జరగడంతో రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ అలెర్టయింది. గణపతి లొంగిపోతే స్వాగతిస్తామని రాష్ట్ర పోలీసుల తరఫున సోషల్ మీడియాలో ఒక ప్రకటన వైరలైంది. గణపతి తీవ్రవాదాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించింది. జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటున్న గణపతికి డిపార్ట్‌మెంట్ పూర్తిగా సహకరిస్తుందని తెలిపింది. అనారోగ్య కారణాలు, పార్టీ సిద్ధాంతాలతో విభేదించిన చాలామంది మావోలు జనంలో కలిశారని పోలీస్ డిపార్ట్‌మెంట్ వర్గాలు చెబుతున్నాయి. జంపన్న, సుధాకర్ లాంటి వారికి ఎలా సహకరించామో గణపతికి కూడా అదే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపాయి. సరెండర్ కావాడానికి ఎప్పుడు వచ్చినా స్వాగతిస్తామని చెప్పాయి. లొంగిపోవాలనుకునే మావోలు బంధువులు లేదా మీడియా ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని డిపార్ట్ మెంట్ సూచించింది. గణపతికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు1,137 మంది జనంలో కలిశారని చెప్పింది. గణపతితో పాటు మల్లోజుల కూడా లొంగిపోవాలని కోరింది.
For More News..