మోడీ ప్రభుత్వానికి భారీగా పెరిగిన అప్రూవల్​ రేటింగ్​

మోడీ ప్రభుత్వానికి భారీగా పెరిగిన అప్రూవల్​ రేటింగ్​
  • మోడీ సర్కారుకు టాప్ రేటింగ్
  • అంచనాలకు మించి పనిచేస్తోందన్న 67 శాతం మంది
  • లోకల్ సర్కిల్స్​ సర్వేలో వెల్లడి
  • 64 వేల మంది నుంచి 
  • అభిప్రాయాల సేకరణ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అప్రూవల్​ రేటింగ్​ భారీగా పెరిగింది. లోకల్​సర్కిల్స్​ అనే సంస్థ చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఈ స్థాయికి అప్రూవల్ రేటింగ్​ చేరడం ఇదే తొలిసారి. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా ఈ ఫలితాలు రావడం విశేషం. మే 30తో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పలు కీలక అంశాలపై మొత్తం 64 వేల మంది నుంచి ఈ సంస్థ అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 67 శాతం మంది రెండో టర్మ్ లో మోడీ సర్కారు అంచనాలకు మించి పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత జరిపిన సర్వేలో ఇది 62 శాతం ఉండగా.. కరోనా రెండో దశలో ఇది 51 శాతంగా ఉంది. థర్డ్​ వేవ్​ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, అలాగే ఎకానమీని సరిదిద్దడంలోనూ ప్రభుత్వం సక్సెస్​ అయ్యిందని అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. 37 శాతం మంది ప్రభుత్వ చర్యల పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. 2020లో ఇది 29 శాతం, 2021లో 27 శాతం మాత్రమే. 73 శాతం మంది గత మూడేండ్లలో నిత్యావసర వస్తువుల తగ్గలేదని చెప్పారు. 73 శాతం మంది తమ భవిష్యత్తు, తమ కుటుంబం భవిష్యత్తుపై భరోసాతో ఉన్నట్టు తెలిపారు. గాలి నాణ్యతను పెంచేందుకు, పొల్యూషన్​ను తగ్గించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని 44 శాతం మంది చెప్పారు. మత సామరస్యానికి సంబంధించి ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుంటోందని 60 శాతం మంది చెప్పగా.. 33 శాతం మంది దీనితో ఏకీభవించలేదు. ఇండియా వ్యాపారం చేయడం సులభతరమైందని 50 శాతం మందికిపైగా అభిప్రాయపడ్డారు.