వరంగల్లో మళ్లీ కుండపోత.. పొద్దుపొద్దున్నే రెండు గంటలు దంచికొట్టిన వర్షం

వరంగల్లో మళ్లీ కుండపోత.. పొద్దుపొద్దున్నే రెండు గంటలు దంచికొట్టిన వర్షం
  • చెరువుల్లా మారిన వరంగల్‍, హనుమకొండ మెయిన్ రోడ్లు
  • అండర్‍ బ్రిడ్జి వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు 
  • ఆందోళనకు గురైన వృద్ధులు, మహిళా ప్యాసింజర్లు
  • తాళ్ల సాయంతో బాధితులను బయటకు తీసుకొచ్చిన డీఆర్‍ఎఫ్‍ టీం, పోలీసులు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్  వరంగల్​లో ఆదివారం (సెప్టెంబర్ 07) పొద్దుపొద్దున్నే వర్షం దంచికొట్టింది. ఉదయం 6 గంటలకు ఉరుములు, మెరుపులతో చిన్నగా మొదలైన వాన.. రెండు గంటల పాటు గ్రేటర్‍ వరంగల్‍ ట్రై సిటీపై విరుచుకుపడింది. లోతట్టు కాలనీలతో పాటు వరంగల్‍, హనుమకొండ, కాజీపేట ప్రదాన రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. వరంగల్​లో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకోగా.. హనుమకొండ పరిధిలో ఇండ్లు, షాపుల్లోకి బురద నీరు చేరింది. జీడబ్ల్యూఎంసీ, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

నీట మునిగిన కాలనీలు..

రెండు గంటల భారీ వర్షానికి లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి. జనాలు నిద్ర లేవకముందే భారీ వర్షంతో కాలనీలు చెరువుల్లా మారడంతో ప్రజలు తిప్పలు పడ్డారు. వరంగల్‍ ప్రాంతంలోని శివనగర్‍, ఎస్‍ఆర్‍ నగర్‍, మైసయ్య నగర్‍, అమరావతి నగర్‍, సంతోషిమాత టెంపుల్‍ ఏరియా, హంటర్‍రోడ్‍తో పాటు హనుమకొండ చౌరస్తా, సిటీ కొత్త బస్టాండ్‍, భవానీ నగర్‍, గోకుల్‍ నగర్‍, అశోక కాలనీతో పాటు 25 లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరింది. సిటీ జనాలు ఎక్కువగా ప్రయాణించే వరంగల్‍, హనుమకొండ మెయిన్‍రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు అందులో చిక్కుకుని మొరాయించాయి. 

వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు..

వరంగల్‍ శివనగర్‍ అండర్‍బ్రిడ్జి వద్ద వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. రైల్వే  బ్రిడ్జి కిందికి వరద నీరు చేరగా, గమనించని డ్రైవర్లు ముందుకు వెళ్లారు. బ్రిడ్జి కిందకు వచ్చే సరికి బస్సు ఇంజిన్‍లోకి నీరు చేరి వరదలో చిక్కుకుపోయాయి. చాతీ లోతు నీరు ఉండడంతో బస్సు దిగేందుకు ఎవరూ సాహసించలేదు. 

వృద్ధులు, పిల్లలు, మహిళా ప్యాసింజర్లు భయంతో వణికిపోయారు. రెండు బస్సులు నిలిచిపోవడంతో సిటీకి వచ్చే వాహనాలతో ట్రాఫిక్‍ జామ్‍ అయింది. స్థానికుల సమాచారంతో ఇంతేజార్‍గంజ్‍, మిల్స్  కాలనీ పోలీసులు, జీడబ్ల్యూఎంసీ మాన్‍సూన్‍ రెస్పాన్స్  టీం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

తాళ్ల సాయంతో 50 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత క్రేన్లు, భారీ తాళ్ల సాయంతో బస్సులను బయటకు తీసుకువచ్చారు. ఇదిలాఉంటే ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షం కురవగా నగరమంతా అతలాకుతలమైంది. ఆ తరువాత నుంచి సాయంత్రం వరకు గ్రేటర్‍ వరంగల్​లో ఎండ దంచికొట్టింది. సిటీలో ఎక్కడా భారీ వర్షం కురిసిన ఆనవాళ్లు లేకుండా పోయాయి.