దంచికొడ్తున్న వానలు .. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత..

దంచికొడ్తున్న వానలు .. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత..
  • అస్సాంలో ఇప్పటి దాకా 66 మంది మృతి 
  • 24 లక్షల మందిని తాకిన వరద
  • మహారాష్ట్ర, యూపీ, పంజాబ్​లోనూ వానలు
  • ఉత్తరాఖండ్​లో డేంజర్ లెవల్​లో ప్రవహిస్తున్న గంగా నది

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వానలు దంచికొడ్తున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్​తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా అస్సాంలో 24 లక్షల మంది ప్రభావితం అయ్యారు. ఈ ఏడాదిలో అస్సాంలో రెండో సారి సంభవించిన వరదల్లో 66  మంది చనిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్స్​లో ప్రజలు తలదాచుకుంటున్నారు.

 కామ్​రూప్​లో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపును సీఎం హిమంత బిస్వా శర్మ సందర్శించారు. మణిపూర్, మిజోరం, అరుణాచల్​ప్రదేశ్​లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 5 రోజుల పాటు నార్​ఈస్ట్​తో పాటు నార్త్​వెస్ట్ ఇండియాలో కుండపోత వానలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా జులైలో పలు రీజియన్స్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ముంబైలో నిలిచిన లోకల్ ట్రైన్స్

రాజస్థాన్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చురు జిల్లాలోని తారానగర్​లో 24 గంటల్లో 14.10 సెంటీ మీటర్లు, కరౌలీలో 13.10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గంగానగర్, హనుమాన్​గఢ్, దౌసా, జైపూర్, దుంగాపూర్​లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలోని ముంబైలోనూ వానలు దంచికొడ్తున్నాయి. ఠానేలోని రిసార్ట్​లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడటంతో ఠానే జిల్లాలోని కసారా, టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్స్​ను ఆపేశారు. బిహార్​లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోసి, మహానంద, గండక్, కమ్లా బాలన్ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. బాగామతి నది ఉప్పొంగడంతో ముజఫర్​నగర్, అరుయి, సుప్పి ప్రాంతాలు నీట మునిగాయి.

చార్ ధామ్​ యాత్రకు బ్రేక్

ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గర్హ్వాల్ రీజియన్​లో సోమ, మంగళవారం కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా చార్​ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. రుషికేశ్​లో భారీ వర్షాలు కురుస్తాయని, గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నదని, ఇటు వైపు భక్తులు ఎవరూ రావొద్దని రెడ్ అలర్ట్ జారీ చేశారు. చార్​ధామ్ యాత్ర ఆపేయాలని, లేదంటే పోస్ట్​పోన్ చేసుకోవాలన్నారు. బద్రీనాథ్‌‌ హైవేపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డా యి. రుద్రప్రయాగ్, పౌరీ, టెహ్రి, అల్మోరా, నైనిటాల్  జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.