అదానీ గ్రూప్​తో టోటల్​ మరో పెట్టుబడి

అదానీ గ్రూప్​తో టోటల్​ మరో పెట్టుబడి
  • కొత్త  జాయింట్​ వెంచర్

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​తో కలిసి ఏర్పాటు చేస్తున్న జాయింట్​ వెంచర్​ కంపెనీలో టోటల్​ ఎనర్జీస్ 300 మిలియన్​ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. అదానీ గ్రూప్​పై షార్ట్​సెల్లర్​ హిండెన్​బర్గ్​ ఆరోపణల తర్వాత ఈ ఫ్రెంచ్​ కంపెనీ మొదటి పబ్లిక్​ డీల్ ఇదే​ కావడం విశేషం. కొత్త జాయింట్​ వెంచర్ ​కంపెనీలో టోటల్​ ఎనర్జీస్​కు 50 శాతం వాటా, అదానీ గ్రీన్​ ఎనర్జీ లిమిటెడ్​కు 50 శాతం వాటా ఉంటాయి. రెండు కంపెనీలు కలిసి ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి. జాయింట్​ వెంచర్​ కంపెనీ కింద 1,050 మెగావాట్ల కెపాసిటీ పోర్ట్​ఫోలియో ఉండనుంది. ఇందులో 300 మెగావాట్ల కెపాసిటీ ఇప్పటికే ఆపరేషనల్​ అయింది. మరో 500 మెగావాట్ల కెపాసిటీ నిర్మాణంలో ఉందని, కొత్తగా 250 మెగావాట్ల విండ్​పవర్​, సోలార్​ ప్రాజెక్టులు డెవలప్​ చేస్తామని ఈ కంపెనీలు వెల్లడించాయి. క్లీన్​ ఎనర్జీ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెంచే దిశలోనే ఈ జాయింట్​వెంచర్​ కంపెనీలో ఇన్వెస్ట్​ చేస్తున్నట్లు టోటల్​ ఎనర్జీస్​ తెలిపింది. అదానీ గ్రీన్​ ఎనర్జీ లిమిటెడ్​లో టోటల్​ ఎనర్జీస్​కు ఇప్పటికే 19.7 శాతం వాటా ఉంది.

ఏజీఈ23ఎల్ ​పేరుతో రెండు కంపెనీలకు సమానవాటాతో ఒక జాయింట్​ వెంచర్​ కూడా కొనసాగుతోంది. ఈ జాయింట్​ వెంచర్​ కంపెనీకి  2,353 మెగావాట్ల పోర్ట్​ఫోలియో ఉంది. టోటల్​ ఎనర్జీస్​తో కొత్త జాయింట్​ వెంచర్​ కంపెనీ ఏర్పాటుపై స్టాక్​ఎక్స్చేంజీలకు అదానీ గ్రూప్​ సమాచారం ఇచ్చింది. అదానీ గ్యాస్​ లిమిటెడ్​లో 2019 లోనే టోటల్​ ఎనర్జీస్​ 600 మిలియన్​డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడితో 37.4 శాతం వాటా పొందింది. ఈ కంపెనీని ఇప్పుడు అదానీ టోటల్​ గ్యాస్​ లిమిటెడ్​గా వ్యవహరిస్తున్నారు. అదానీ గ్రూప్​తో కలిసి గ్రీన్​ హైడ్రోజన్​ ప్రాజెక్టును టోటల్​ ఎనర్జీస్ ​చేపడదామనుకుంది. కానీ, హిండెన్​బర్గ్​ రిపోర్టు నేపథ్యంలో ఆ ప్రపోజల్​ ముందుకు సాగలేదు.