జైనథ్​ గుడి చూసొద్దాం

జైనథ్​ గుడి చూసొద్దాం

ఆదిలాబాద్​ అంటేనే అడవితల్లి కట్టిన ఆకుపచ్చని చీర. పచ్చని చెట్లు, వాగులు, వంకలు, జలపాతాలకు నెలవు అయిన ఈ ప్రాంతం పురాతన దేవాలయాలకు కూడా ఫేమస్​. అలాంటి వాటిలో జైనథ్​ ఊర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం చూడాల్సింది. ఇది తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. జైన దేవాలయాన్ని పోలి ఉండడంతో దీన్ని ‘జైనథ్​ దేవాలయం’ అని పిలుస్తారు. పూర్తిగా నల్లరాయితో కట్టిన ఈ గుడికి 800 ఏండ్ల  చరిత్ర ఉంది. పెద్దపెద్ద రాళ్లను తొలచి మహాబలిపురం వంటి గుడులు కట్టిన పల్లవుల కాలం నాటిది ఈ గుడి.

జైనథ్​ గుడి లోపలి, బయటి గోడలపై చెక్కిన శిల్పాలు పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం.  ఈ గుడి బయటి గోడలపైన 20 శ్లోకాలు చెక్కి ఉంటాయి. ఈ గుడిని నాలుగు నుంచి తొమ్మిదో శతాబ్దంలో పల్లవ రాజులు కట్టించారని ఈ శ్లోకాల్లో ఉంది. రెండు అడుగుల ఎత్తైన ప్లాట్​ఫామ్​ మీద ఈ గుడిని కట్టారు. గర్భగుడిలో 6 అడుగుల ఎత్తైన స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని పూర్తిగా నల్లరాతితో చేశారు. 

ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏమిటంటే.. దసరా తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజున సూర్యుడి కిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో జైనథ్​ గుడికి వస్తుంటారు. ఏటా అక్టోబర్​–నవంబర్ నెలల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. రథోత్సవం కూడా కన్నులపండువగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నారాయణస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని ‘నారాయణ స్వామి, నారాయణమూర్తి, లక్ష్మీనారాయణుడు’ అని కూడా పిలుస్తారు. జైనథ్​ గుడి కారణంగానే తమ ఊరికి ‘జైనథ్’​ అని పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు.  

ఇలా వెళ్లాలి

ఆదిలాబాద్​ రైల్వేస్టేషన్​ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది జైనథ్​ గుడి. హైదరాబాద్​ నుంచి 327 కిలోమీటర్ల జర్నీ. 

టైమింగ్స్: ఉ. 6 నుంచి రాత్రి 8:30 వరకు.