V6 News

టూరిస్టుల ప్రాణాలంటే లెక్క లేదు : పర్యాటకులు

టూరిస్టుల ప్రాణాలంటే లెక్క లేదు : పర్యాటకులు
  • కోట్​పల్లి పేరుకే పర్యాటక ప్రాంతం..  వసతుల కల్పన ఉత్తమాట
  • ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ గోడ లేదు
  • నీరున్న ప్రాంతంలో కానరాని పోలీసు పహారా

వికారాబాద్,​ వెలుగు: కోట్​పల్లి ప్రాజెక్టు నీటిలో మునిగి పలువురు పర్యాటకులు చనిపోవడానికి అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే కారణమని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఈ ప్రాజెక్టు నీటిలో మునిగి నలుగురు యువకులు మాత్రమే చనిపోలేదని, అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు. కోట్​పల్లి ప్రాజెక్టు, వికారాబాద్​ అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రతి శని, ఆదివారం హైదరాబాద్  నుంచి  25 వేల మంది నుంచి 30 వేల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఓ వైపు ఆధ్యాత్మిక అనుభూతి పంచే అనంత పద్మనాభ దేవాలయం, మరోవైపు పచ్చని అడవికి తోడు కోట్​పల్లి  ప్రాజెక్టు చూపరులను ఆకట్టుకుంటోంది. రెవెన్యూ, ఫారెస్టు, పోలీసు, ఇరిగేషన్​, పర్యాటక శాఖల అధికారులు.. సందర్శకుల వెహికల్స్ కోసం పార్కింగ్‌‌ ఫీజు కింద రూ.30  నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. కానీ లైఫ్ జాకెట్లు వంటివి ఏవీ ఇవ్వకుండానే పర్యాటకులను లోపలికి అనుమతిస్తున్నారు. వసూళ్లపై ఉన్న శ్రద్ధ పర్యాటకుల రక్షణపై లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నదులు, చెరువులు వంటి ప్రాంతానికి పర్యాటకులను అనుమతించే ముందు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారికి తప్పనిసరిగా లైఫ్​ జాకెట్లు అందించాలి. నీటిలోకి దిగకుండా రక్షణ వలయం ఏర్పాటు చేయాలి. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. నిరంతరం అటవీ, పోలీసు శాఖల అధికారులు పర్యాటకులను గమనిస్తుండాలి. సమయం దాటేలోపు వారిని పంపించేయాలి. కానీ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నీరు ఉన్న ప్రాంతం చుట్టూ జాలి లేదా, కంచె వేయాలని పర్యాటకులు సూచిస్తున్నారు. సోమవారం జరిగిన సంఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడుతున్నారు. ప్రతి నెలా ఒకరు, ఇద్దరో నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువు వద్ద రక్షణ చర్యలు శూన్యం

కోట్ పల్లి ప్రాజెక్ట్ దగ్గర గతంలోనూ ఎంతో మంది చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల నివారణకు  చేపట్టాల్సిన భద్రతా చర్యలను అటవీ, నీటి పారుదల, పర్యాటక శాఖలు గాలికి వదిలేశాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి డబ్బువసూలు చేయాలన్న ఆలోచన తప్ప  రక్షణ కల్పించడంలో అధికారులు ఫెయిలయ్యారని మండిపడుతున్నారు. 

గోతిని తవ్వి మట్టి తరలించిన కాంట్రాక్టర్

చెరువు నిర్మాణ సమయంలో అలుగు ప్రాంతంలో అలుగు నుంచి వంద మీటర్ల దూరం మీటర్​ లోతు నీరు నిలిచేలాగా నిర్మాణం చేశారు. 2018, 2019 లో ధారూర్​ నుంచి వికారాబాద్​ వచ్చే ఆర్​అండ్​బీ రోడ్డులో సదరు కాంట్రాక్టర్​ జేసీబీలతో తవ్వి మట్టిని తరలించారు. మూడేండ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులో నీరు ఎండిపోవడంతో అలుగుకు 10 మీటర్ల దూరంలో 20 నుంచి 30 మీటర్ల లోతు గోతులు తవ్వి మట్టి తీసుకెళ్లారు. అయితే ఈ సంవత్సరం వర్షాలు బాగా కురువడంతో చెరువు నిండుకుండలా మారింది. ఈ క్రమంలో పర్యాటకులు నడుంలోతు నీటిలో దిగుతున్నారు. వారిలో ఈతరాని వారు ఉంటున్నారు. ఈ గోతులే సోమవారం నలుగురి మృతికి కారణం అయ్యాయి.