వైఎస్ఆర్‌‌ను బెదిరించి తెలంగాణ కోసం కట్టె పట్టుకుని..

వైఎస్ఆర్‌‌ను బెదిరించి తెలంగాణ కోసం కట్టె పట్టుకుని..
  • పోతిరెడ్డిపాడు  పొక్క మూయాల్సిందేనని పీజేఆర్ ఆనాడే కొట్లాడిండు
  • పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పోతిరెడ్డిపాడు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం కాబోతుందని దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ అప్పట్లోనే చెప్పారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మన ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం పోతిరెడ్డిపాడు పొక్కను మూయాల్సిందేనని ఆయన ఆ రోజు అన్న విషయం నేడు నిజమైందని చెప్పారు. కృష్ణా నదీ జలాలు తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పీజేఆర్ అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి కూడా నాటి సీఎం వైఎస్ఆర్‌‌ను బెదిరించి తెలంగాణ కోసం కట్టె పట్టుకుని నిలబడ్డాడని గుర్తు చేశారు. కానీ నేడు కృష్ణా జల వివాదాలపై సీఎం కేసీఆర్ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే తప్ప పరిష్కారం కోసం ప్రయత్నించడం లేదని ఆరోపించారు. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని తన నివాసంలో రేవంత్ రెడ్డి సహా మరికొందరు నేతలు కలిశారు.  అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా,  పీజేఆర్ వారసుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,  ఢిల్లీ కాంగ్రెస్‌లో అందరికీ సన్నిహితులని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే పీజేఆర్..- పీజేఆర్ అంటే కాంగ్రెస్  అన్న ప్రభావాన్ని చూపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పుడు ఎల్పీ నేత గా ఒక్కడు వందమందితో సమానంగా ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేసిండని గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి సమస్య తీరింది అంటే దానికి పీజేఆర్ కృషి ఎంతో ఉందన్నారు.  
తెలంగాణ కోసం కొట్లాడిండనే మంత్రి పదవి ఇయ్యలే
తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతున్నాడనే ఆ రోజు వైఎస్ఆర్ కక్షగట్టి నాడు పీజేఆర్‌‌కు మంత్రి పదవి ఇవ్వలేదని రేవంత్ అన్నారు. పీజేఆర్ సేవలను ముందుకు తీసుకుపోయేందుకు విష్ణుకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఉద్దెర మాటలు మాట్లాడటంలో దానం నాగేందర్‌‌ను మించినోడు లేడని ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో పీజేఆర్ కుటుంబానికి పార్టీలో మంచి ప్రాధాన్యత కల్పిస్తామని రేవంత్ అన్నారు.  గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరితో కలిసి పని చేస్తామని చెప్పారు.