- కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ప్రశ్నిస్తలే?: పీపీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
- మెట్రో ఫేజ్2, ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులేవి? నిధులేవి?
- ఆ ఇద్దరు కేంద్ర మంత్రులకు రాష్ట్రాభివృద్ధి పట్టదా?
- పదేండ్ల కేసీఆర్ పాపపు పాలనలో కవితకూ భాగస్వామ్యం
- వాళ్ల హయాంలో అమరుల కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయలేదో చెప్పాలి
- పాదయాత్రతోనైనా ప్రజల సమస్యలు తెలుస్తయ్.. ఆమె పాదయాత్రను స్వాగతిస్తున్న
- కేసీఆర్ వల్లే తెరపైకి బనకచర్ల.. జూబ్లీహిల్స్‌లో 100% గెలిచేది కాంగ్రెస్సే
- నెలాఖరులో డీసీసీ చీఫ్‌ల ప్రకటన ఉంటదని వెల్లడి.. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని.. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించడం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నిలదీశారు. ‘‘పార్టీలు, రాజకీయాలు ఎన్నికల వరకే. ఎన్నికల తరువాత అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కృషి చేయాలి.. ఈ విధానంతోనే పక్కరాష్ట్రం తమిళనాడు ఎంతో సాధించుకుంది. కానీ.. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిర్లక్ష్యం వల్ల మెట్రో ఫేజ్ 2, ప్రాజెక్టులు, పరిశ్రమల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఏవి? నిధులేవి? ఆ ఇద్దరు కేంద్ర మంత్రులకు రాష్ట్రాభివృద్ధి పట్టదా?” అని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఢిల్లీకి వచ్చిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.. ఆదివారం తెలంగాణ భవన్‌లోని శబరీ బ్లాక్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు.
అన్ని అంశాల్లో కవిత వాస్తవాలు మాట్లాడాలి
కేసీఆర్ పదేండ్లు గాడి తప్పిన పాలన చేశారని, రాష్ట్రాన్ని దివాలా తీయించారని మహేశ్‌గౌడ్ ఫైర్ అయ్యారు. నాడు ఏపీ మంత్రిగా ఉన్న రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లి చేపల పులుసు మత్తులో రాయలసీమను రతనాల సీమ చేస్తానంటూ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ ఉదాసీనత వల్లే ఏపీ సర్కార్ బనకచర్ల ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతగా తాను కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. ‘‘పాదయాత్రలు చాలా మంచివి. కనీసం ప్రజల సమస్యలైనా తెలుస్తాయి. అయితే.. కవిత సగం నిజాలు, సగం అబద్ధాలు చెప్తున్నారు. మొత్తం నిజాలు మాట్లాడినప్పుడు పూర్తిగా స్వాగతిస్తాం. కేసీఆర్ పదేండ్ల పాపపు పాలనలో కవితకు సైతం భాగస్వామ్యం ఉంది. అందుకే ఆమెను ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అమరవీరులకు ఎందుకు న్యాయం చేయలేదో ప్రజలకు చెప్పాలి. అన్ని అంశాల్లో కవిత వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.
నేతలు ఎవరూ పార్టీ లైన్ దాటొద్దు
మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయం అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఇంకా స్పందించడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ విషయాన్ని కేటీఆర్, హరీశ్‌రావు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మంత్రుల మధ్య పంచాయితీపై అధిష్టానం అడిగితే అప్పుడే సంపూర్ణ వివరణ ఇచ్చామన్నారు. అయితే ఈ విషయంలో కొండా సురేఖ కూతురు కులాల ప్రస్తావన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆమె పార్టీకి చెందిన వ్యక్తి కాదని గుర్తుచేశారు. ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి
మాట్లాడటం ఆక్షేపణీయమని అన్నారు. ఎవరు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని ఆయన సూచించారు. ‘‘గోడలకు సైతం చెవులు ఉండే సమయం. నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి” అని తెలిపారు. ఎవరైనా పార్టీ నియమాలకు లోబడే ఉండాలని, ఫైనల్ గా పార్టీలో అన్నింటికన్నా అధిష్టానమే సుప్రీం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని పీసీసీ చీఫ్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అన్ని పరిస్థితులను హైకమాండ్ గమనిస్తుందన్నారు. ‘‘అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నామని గుర్తుంచుకోవాలి. మంత్రులు, నేతలు చేసే అన్ని మంచి, చెడులు అధిష్టానం నోట్ చేస్తుంది’’ అని పేర్కొన్నారు. కేసీ వేణుగోపాల్‌తో చర్చల్లో డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్, మంత్రుల తీరు, తాజా రాజకీయ పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. కాగా.. మంత్రుల తీరుపై తాజా కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాలతో పాటు కలిసిగట్టుగా ఉండాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.
నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల ప్రకటన
డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు పీసీసీ చీఫ్‌గా తన అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుందని మహేశ్‌గౌడ్ తెలిపారు. అలాగే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సైతం అభిప్రాయాలను పంపారన్నారు. ఈ నెలాఖరులోపు తెలంగాణతో పాటు రాజస్తాన్, చత్తీస్ గఢ్ మూడు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో మరోసారి హైకమాండ్ నుంచి పిలుపు రాదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే.. ఆశావహులు ఎక్కువగా ఉన్న జిల్లాల డీసీసీల ఎంపిక కొలిక్కి రాలేదని, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం 36 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక మంత్రులు పలువురి పేర్లను సిఫారసు చేశారన్నారు. అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, ఇతర ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్షులుగా చాన్స్
డీసీసీ అధ్యక్షులుగా నలుగురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. మంత్రి ఉత్తకుమార్ రెడ్డి భార్య డీసీసీ అధ్యక్ష పదవి కోసం అప్లయ్ చేసినట్లు తెలిసిందన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు డబుల్ పోస్టులుగా చూడటం లేదని.. సదరు కుటుంబాలు అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే వాళ్ల వారసులకు పదవులు అడ్డంకి కాదని అన్నారు. ఉన్నఫలంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరని తేల్చిచెప్పారు. ‘‘నేను పార్టీలో ఉన్న.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు. అదే కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ల కుటుంబాలు పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్నాయి. అలాంటి వాళ్లకు ఇస్తారు’’ అని ఆయన ఉదాహరించారు.
జూబ్లీహిల్స్ లో 100% గెలుస్తం
బీజేపీకి ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయడమే తప్ప ప్రజల అభివృద్ధి పట్టదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇదే ఆలోచనతో ఆ పార్టీ ముందుకెళ్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కో నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న దని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం తమ సంస్కృతి కాదన్నారు. జూబ్లీహిల్స్ లో పదేండ్లు బీఆర్ఎస్ గెలిస్తే ఓటు చోరీ కాంగ్రెస్‌తో ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఓట్ చోరీ పై తొలుత ఫిర్యాదు చేసింది రేవంత్ రెడ్డి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని, 100 శాతం గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 4, సెకండ్ ఫేజ్ లో 2 మీటింగ్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.
