కేసీఆర్ మూడోసారి గెలిస్తే 4 కోట్ల మందికి కన్నీళ్లే: రేవంత్

కేసీఆర్ మూడోసారి గెలిస్తే 4 కోట్ల మందికి కన్నీళ్లే: రేవంత్
  • ఉమ్మడి పాలమూరు సీట్లన్నీ కాంగ్రెస్​వే
  • ఇందిరమ్మ రాజ్యమంటే ఆ సన్నాసికి ఏం తెలుసు
  • రైతులను పొట్టన పెట్టుకున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి
  • మంత్రి నిరంజన్​రెడ్డి అత్యంత అవినీతిపరుడు
  • వనపర్తి, బిజినేపల్లి, అచ్చంపేట సభల్లో పీసీసీ చీఫ్ ​వ్యాఖ్యలు

వనపర్తి/బిజినేపల్లి/అచ్చంపేట, వెలుగు: ప్రజలంతా తలా ఓ ఇటుక తీస్తే దొర గడీ కూలుతదని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలోని నాలుగు కోట్ల మందికి కన్నీళ్లే మిగులుతాయని ఆయన చెప్పారు. వనపర్తి, బిజినేపల్లి(నాగర్ కర్నూల్), అచ్చంపేటలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్​పాల్గొని మాట్లాడారు. వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డికి  వందల ఎకరాలు భూమి, రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్​ల​ఫాంహౌస్ లకు దీటుగా వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడని, నిరంజన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడనే ముద్ర పడిందని విమర్శించారు. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. మూడేళ్లలో తెలంగాణలో 83 వేల మంది రైతులు చనిపోయారని, ఇంత మందిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రేవంత్​పిలుపునిచ్చారు.

నీ అహంకారమే రాజకీయ సమాధి కడ్తది

వచ్చేది దొరల రాజ్యమో.. సామాన్యుల రాజ్యమో భవిష్యత్ ​నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబర్​9న ఏర్పడేది మాత్రం ఇందిరమ్మ రాజ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరులో14 సీట్లు గెలిపిస్తే.. తెలంగాణలో 100 సీట్లు గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్​చెప్పారు. కరీంనగర్ ప్రజలు100 మీటర్ల గుంత తీసి బొందపెడితే పారిపోయి పాలమూరుకు వచ్చిన కేసీఆర్​ను గెలిపించి పార్లమెంట్​కు పంపించామని, కేసీఆర్​ పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ‘‘ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పరిశ్రమలు రాలేదు. వలసలు ఆగలేదు. సర్కారు స్కూళ్లు బంద్ అయినయ్. పిల్లల చదువులు ఆగినయ్’’ అని మండిపడ్డారు. 

ఇందిరమ్మ రాజ్యమంటే..

‘‘ఇందిరమ్మ రాజ్యమంటే నీఊరు చింతమడకకు రోడ్డేయడం. నీవు చదివిన స్కూల్, కాలేజీ ​కట్టించడం. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ఎస్ఆర్ఎస్పీ, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులు కట్టించి70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం. పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వడం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం. 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ​ప్రభుత్వమే’ అని రేవంత్​ చెప్పారు. కాంగ్రెస్ ​చేసిన అభివృద్దిని గుర్తించలేని కేసీఆర్​ఇందిరమ్మను తిట్టేంత మొనగాడయ్యాడని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ దయ తలిచి టికెట్ ఇస్తే సింగిల్​విండో డైరెక్టర్​గా పోటీ చేసినవ్. యూత్​కాంగ్రెస్ ​వైస్​ ప్రెసిడెంట్​గా పని చేసినవ్.

కేంద్ర మంత్రి అయినవ్. వైఎస్ఆర్​దయతలిస్తే రబ్బర్ చెప్పులేసుకునే హరీశ్​రావు ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయ్యాడు. నీ కొడుకు కేటీఆర్​ ఫారిన్​లో ఐటీ చదువులకు పోయింది రాజీవ్​తెచ్చిన టెక్నాలజీ పుణ్యమే’’ అని కేసీఆర్ పై రేవంత్​విరుచుకుపడ్డారు. 1,200 మంది విద్యార్థులు, యువకులు అమరులైంది కేసీఆర్ ను సీఎం, కొడుకు, అల్లుడిని మంత్రులను చేసేందుకా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​​చేసిన అభివృద్ధి 3 వేల వైన్​ షాపులు, 62 వేల బెల్టు షాపులు తీసుకురావడమా అని నిలదీశారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల ప్రజలపై దాడులు చేస్తుంటే కేసీఆర్​కు ఎందుకు పట్టలేదని నిలదీశారు. దాడులను తిప్పి కొట్టి ఇక్కడే బొంద పెడతామని హెచ్చరించారు.

మీకోసమే ఈ ఆరాటం, తపన

‘‘నల్లమలలోని రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన. బూర్గుల రామకృష్ణరావు తర్వాత 78 ఏండ్లకు మళ్లీ పాలమూరుకు నా ద్వారా మరో అవకాశం వచ్చింది. సోనియా గాంధీ పీసీసీ చీఫ్​ పదవి ఇచ్చింది. పాలమూరు బాధ, గోస తెలిసినోడ్ని, కడుపు కట్టుకుని నిజాయతీగా పనిచేసిన. కడుపులో పేగులు తెగేదాకా కొట్లాడిన. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. పాలమూరు బతుకులు మార్చుకుందాం.

ప్రాజెక్టులు కట్టుకుందాం. నా బాధ, ఆవేదన మన ప్రాంతం కోసమే’’ అని రేవంత్ చెప్పారు. అచ్చంపేటలో డా.వంశీకృష్ణను, నాగర్​కర్నూల్​లో డా.రాజేశ్​రెడ్డిని, వనపర్తిలో మేఘారెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయా సభల్లో టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు డా.మల్లు రవి, డా.మంద జగన్నాథం, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.