ఇంటి దొంగల చిట్టా రెడీ.. ఎవ్వర్నీ వదలం

ఇంటి దొంగల చిట్టా రెడీ.. ఎవ్వర్నీ వదలం
  • కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందిపెడితే తొడుకలు తీస్తాం
  • పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ కార్యకర్తలను టి.ఆర్.ఎస్ నేతలు, అధికారులు ఇబ్బందిపెడితే తోడుకలు తీస్తామని.. ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎవరు ఏమేం చేస్తున్నారో అందరి చిట్టభారతం డైరీలో రాసిపెట్టుకుంటున్నామని.. ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు దారుణంగా తగ్గిపోయాయి..  క్రూడాయిల్ ధరలు విపరీతంగా పడిపోయినా..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోగా మరింత పెంచి పేదలపై భారం మోపుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మనచుట్టు ఉన్నదేశాల్లో మనకంటే సగం ధరకే పేట్రోల్ డీజిల్ దొరుకుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.40కే లీటర్ ఇవ్వాల్సిన పెట్రోల్ ను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సుంకం రూపంలో రూ.65 దోచుకుంటున్నాయన్నారు. అసలు కంటే మిత్తి ఎక్కువ ఎక్కడైనా ఉంటుందా.. అని ఆయన ప్రశ్నించారు. పెట్రోలు లీటర్ రూ.105 పెట్టి కొంటుంటే.. ఇందులో పెట్రోలు ధర రూ.40 మాత్రమేనని.. కేంద్రం 33 రూపాయలు, కేసీఆర్ ప్రభుత్వం 32 రూపాయలు పన్నుల రూపంలో దోచుకుంటున్నాయని ఆరోపించారు.  ఏడేళ్లలో పెట్రో పేరుతో కేంద్రం 36లక్షల కోట్లు, రాష్ట్రం 12లక్షల కోట్లు దండుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పెట్రోల్ ను జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. విమానాల్లో తిరిగేటోళ్ల దగ్గర ఒక్క రూపాయి పన్ను వేస్తూ.. పేదోళ్లపై 65 రూపాయలు పన్నుల భారం వేస్తున్నారనే విషయం అందరూ గుర్తించాలని రేవంత్ రెడ్డి సూచించారు. 
పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి అంతా కొరిగినట్లు గుండు కొరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2వేల పెన్షన్ ఇచ్చి.. లిక్కర్ సుంకం రూపంలో కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడన్నారు. వడ్లకు తుట్టి పేరు మీద 10శాతం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గుడి.. గుడిలో లింగం, గుడి బయట చెప్పులు మాయం చేసే ఘనత ఇక్కడి మంత్రిదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పేద రైతుల వడ్లపై కోతలు విధిస్తున్న అధికారులు.. మంత్రి పొలంలో పండిన వడ్లపై ఎందుకు కోతలు విధించలేదన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక .. టి.ఆర్.ఎస్ సర్పంచులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రానికి టి.ఆర్.ఎస్ గులాబీ చీడ పట్టిందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదు.. కేసీఆర్ పట్ల ఇక ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేదని.. 2023లో గోల్కొండ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం, అక్కడే కేసీఆర్ కి ఘోరీ కడుతాం అని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇంటిదొంగలు ఎవరైనా ఉంటే నెలలోపు సర్దుకోవాలని ఆయన హెచ్చరించారు.