తెలంగాణను అంగట్లో సరుకుగా మార్చేసిన్రు: అందెశ్రీ

తెలంగాణను అంగట్లో సరుకుగా మార్చేసిన్రు: అందెశ్రీ
  • కేసీఆర్ ఫాంహౌస్ కు నీళ్ల కోసమే కాళేశ్వరం  
  • బీఆర్ఎస్ కుటుంబ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు 
  • రేపు కాంగ్రెస్ వచ్చినా.. తప్పు చేస్తే ఇట్లే తిరగబడతనని కామెంట్స్  
  • ప్రజా కవి అందెశ్రీతో పీసీసీ చీఫ్ రేవంత్ స్పెషల్ ఇంటర్వ్యూ 

హైదరాబాద్, వెలుగు:   సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ కు నీళ్లు తెచ్చుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ప్రముఖ కవి, ప్రజా గాయకుడు అందెశ్రీ అన్నారు. ప్రాజెక్టు ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు పది అడుగుల కాల్వ తవ్వని కేసీఆర్.. కొండపోచమ్మ సాగర్ వరకు 450 కిలోమీటర్ల దూరం నీళ్లు ఎందుకు ఎత్తిపోసుకుంటున్నట్టు? అని ప్రశ్నించారు. అందెశ్రీని శనివారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను ఆయన పంచుకున్నారు. కేసీఆర్​కు చురకలంటించారు. బంగారు తెలంగాణ అని అంగళ్ల తెలంగాణగా మార్చేశారని మండిపడ్డారు. బంగారం అంటే అసలు అర్థం అంగడి అని అన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు వారి 
మాటల్లోనే...

రేవంత్: రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి.. మేం లేవనెత్తే అంశాలను కొట్టిపారేస్తున్నారు. రాజకీయ ఆరోపణలని అంటున్నారు. కానీ, ప్రజల ఆలోచనను ఆలంబనగా చేసుకుని ముందుకు వెళ్తున్న మీలాంటి వాళ్లు కూడా చెప్పాలి. తెలంగాణ.. బంగారు తెలంగాణ అయిందా?  

అందెశ్రీ: బంగారు తెలంగాణ అని కేసీఆర్ అందరినీ కంగారు పెట్టించారు. బంగారం అంటే ఇంకో అర్థం అంగడి. అందులో విలువలేవీ ఉండవు. అందుకే రాష్ట్రంలో ప్రతిదీ అంగడే అయింది. బంగారం అనంగనే ప్రజలు భ్రమల్లో ఉంటరు.. దానిని వండుకుని తినలేరు కదా. పిడికెడు మట్టికంటే.. కిలో బంగారం సాటి రాదు. అందుకే మనల్ని బంగారంవైపు పరుగులు పెట్టించి.. ఎకరాలకు ఎకరాల మన్నును సారు కాజేయడం మొదలుపెట్టారు. ప్రజలకు ఇక్కడ స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యంతో వచ్చిన పాలనలో కుటుంబ పాలనే దిక్కయింది. సారు చెప్పిందే వేదమైంది. బంగారు తెలంగాణలో ప్రజలను భాగస్వాములను చేయడం కనిపించిందా? సారు, సారు కొడుకు, సారు బిడ్డ, సారు అల్లుడు, సారుకు మందు పోసేటోడు, ఆరో నెంబర్ ఆయన మనుమడు కూడా మాట్లాడుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పది మంది సీఎంలవుతరని వాళ్లంటున్నరు కదా. కానీ, కేసీఆర్ ఇంట్లనే ఇప్పుడు ఐదుగురు సీఎంలు తయారయ్యారు. కేసీఆర్ పిడికెడు వ్యక్తే తప్ప.. అతీతం కాదు. రాజులు, నిజాంలు, నవాబులు అందరూ పోయారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదు.. కుటుంబ పాలన. తెలంగాణను దోచుకోవడానికి అంగడి చేసుకున్న పాలన ఇది. అంగళ్లు చేసి అమ్ముకుంటున్నారు. కులాలను విభజించి పాలిస్తున్నారు.  

రేవంత్: ఎస్టీలైన లంబాడా, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టారు. ముదిరాజ్, గంగపుత్రుల మధ్య లొల్లి పెట్టారు. ఎస్సీల్లో మాల, మాదిగల మధ్య సామరస్యంగా మాట్లాడుకోని పరిస్థితి తెచ్చారు. తెల్లదొరలు విభజించు పాలించు అన్న రీతిలో దేశాన్ని పాలించారు. ఈ పదేండ్లలో తెలంగాణనూ అలాగే చేశారు. ఎందుకు తెలంగాణ ఇట్ల మారింది? 

అందెశ్రీ: సారు దగ్గర అందరూ ఊ కొట్టాల్సిందే. ఆయనకు చెప్పే స్థాయి ఎవరికీ లేదన్నది ఆయన భావన. ఒకానొక రోజు సారు ఒళ్లంతా వణికే ఉంటుంది. బంగారు తెలంగాణ చేసుంటే ఇంత భయమెందుకు వచ్చింది. ప్రజలంటే భయమా.. కాంగ్రెస్ అంటే భయమా.. బీజేపీ అంటే భయమా? కేసీఆర్ పాలసీల వల్లే ఆయనకు ఈ పరిస్థితి. ఓట్లడుక్కునేటప్పుడే ఆయనకు ఈ దుస్థితి. ప్రజలే బాసులు అనుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. 

రేవంత్: ఎంతటి అబద్ధమైనా అందమైన నిజంగా చెప్పడంలో కేసీఆర్​ది అందెవేసిన చెయ్యి. అబద్ధాల్లో ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. ఆయన చెప్పేది నిజంలాగే ఉంటది. తర్వాత అబద్ధమని తెలుస్తది. ఏదైనా సాధించిన తర్వాత జనంలో కొంచెం నిమ్మలత్వం వస్తుందని పెద్దలు చెప్తరు. కానీ కేసీఆర్ రెండు సార్లు సీఎం అయిండు. అయినా మొదలుపెట్టిన అబద్ధాల పునాది 
మీదనే ఎల్లకాలం నడవగలనని ఆయన నమ్మకమా?

అందెశ్రీ: బంగారు తెలంగాణ అన్నదే కోటిపాళ్లు అబద్ధం. సింహం ఎప్పుడైనా వేట దొరక్కుంటే ఎప్పుడైనా తలవంచి గడ్డి తిన్నదా. కానీ, సారూ.. మీరు మేయని అడ్డమైన గడ్డి మేయలేదా? మీరు రాజే అయితే ఒంగబడి ప్రజల కాళ్లపై పడి ఒడి చాచి ఎందుకు ఓట్లు అడుక్కుంటున్నారు? నువ్వు ఎవడికి దొరవి? ఇక్కడ దొరలు చెల్లుబాటు కారు. గడీలను కూలగొట్టి మీ దొరలను తరిమేసిన 
చరిత్ర మా తెలంగాణ వాళ్లది. 

రేవంత్: భూభారతి కింద భూ రికార్డులను డిజిటైజ్ చేసేందుకు నిజామాబాద్​లోనే పైలెట్​గా తీసుకున్నం. కానీ, కేసీఆర్ ధరణి పేరుతో పాత రికార్డులన్నీ పోయినయ్. కాస్తు కాలమ్, కబ్జా, అనుభవ కాలమ్ లేకుండా పోయాయి. పేదోళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది కదా?  


అందెశ్రీ: పదేండ్లలో కేసీఆర్ భూమిని చెరబట్టినంతగా ఏ ముఖ్యమంత్రి కూడా అంత భూమిని చెరబట్టలేదని నాకనిపిస్తది. కోకాపేట భూములకు రూ.100 కోట్లు వచ్చినయని అమ్మేసిండు. కానీ, రేపు రూ.200 కోట్లు వస్తయి. ఆయన భూమిని అమ్మిన​అనుకుంటున్నడు. కానీ, నేను మన అమ్మను తాకట్టు పెట్టిండని అనుకుంటున్నా. కాళేశ్వరం కన్నా దిక్కుమాలిన ప్రాజెక్టును నా జీవితంలో చూడలేదు.12వ శతాబ్దంలో కట్టిన రామప్ప వెయ్యేండ్లు నిలిచింది. చరిత్రకెక్కింది. పర్యాటక కేంద్రంగా గుర్తించారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లుందో చూడండి. మేడిగడ్డ కుంగడమేంది? ప్రాజెక్టు కట్టి కనీసం కాలువలు తవ్వలేదు. కానీ, 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న  కేసీఆర్ ఫాంహౌస్​ కోసం కొండపోచమ్మసాగర్​, మల్లన్నసాగర్​ను నింపేందుకేనా? ఫాంహౌస్ ఉన్న ఏరియాలో భూగర్భజలాలు పెంచేందుకే కాళేశ్వరం కట్టినట్టుంది. 


రేవంత్: కాంగ్రెస్​లో ముగ్గురు బలహీన వర్గాలకు చెందిన సీఎం అభ్యర్థులున్నరు. మా పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు అనే నమ్మకం ఉన్నది. మా పార్టీలో నిర్ణయం తీసుకోనంతవరకు అందరూ అభిప్రాయాలు చెప్తరు. నిర్ణయం వచ్చాక దాన్ని ఫాలో అవుతారు. తెలంగాణ ప్రజలతో ఉన్నది కుటుంబ బంధం అని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చెప్తుంటారు. 
దీనిపై ఏమంటారు?  

అందెశ్రీ: సీఎం ఎవరన్నది పక్కనపెడదాం.. కాంగ్రెస్ లో చాలా మంది సీఎం అభ్యర్థులున్నరు. సరే, కానీ, ఎక్కడ పడితే అక్కడ అందరూ సీఎం సీఎం అని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు. అది వేరే అర్థం పోదా. అట్లా చెప్పకుండా ఎన్నికలు అయిపోయేదాకా చూడండి. సంక్షేమ పథకాలు పేదలకు మంచివే. పేదలకు ఊపిరినిస్తాయి. కానీ, ఉచితాలు ఎక్కువిచ్చి రాష్ట్రాలను అప్పులపాలు చేస్తారా? లేదా దేశాన్ని సంక్షోభంలోకి నెడ్తారా? అన్నది ఆలోచించుకోవాలి.