ఎక్కడ ఎమ్మెల్యే చస్తే అక్కడ పక్కాగా పథకాల అమలు

ఎక్కడ ఎమ్మెల్యే చస్తే అక్కడ పక్కాగా పథకాల అమలు

హైదరాబాద్: కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రావణాసురుడ్ని ఎదుర్కోవడానికి వానర సైన్యం ఎలా పని చేసిందో.. కేసీఆర్‌ను దించడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అదే విధంగా పని చేయాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులని ఆరోపించారు. అమరవీరుల స్థూపాన్ని కూడా వాళ్లు వదల్లేదని.. దాంట్లోనూ కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందన్నారు. త్వరలోనే ఆధారాలతో బయట పెడతానని స్పష్టం చేశారు. తనది కాంగ్రెస్ కుటుంబమని, తాను సోనియా గాంధీ మనిషినన్నారు. 

వద్దన్నా ఉపఎన్నికలు పెడుతున్నరు
‘నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్లు జిల్లా అధ్యక్షులుగా పని చేస్తున్నారు. అలాంటి వారిలో ఉత్సాహం పెంచేందుకు సోనియా నన్ను పీసీసీ చీఫ్‌‌గా నియమించారు. అందరి అభిప్రాయాల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్దాం. సీఎం కేసీఆర్ ఈ మధ్యనే బయటికొస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు బయటికొచ్చే కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోండి. దళితుల మీటింగ్ అని డ్రామాలు చేస్తున్నారు. ఏడేళ్లుగా దళితులపై దాడులు, అక్రమ అరెస్టులు చేసినా పట్టించుకోలేదు. ఆర్థిక ఇబ్బందులతో దళితులు చనిపోయినా పట్టించుకోలేదు. బీసీలను కూడా మోసం చేసిండు. మంగళి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, గొల్ల కురుమ, గౌడ్‌‌లను కూడా మోసం చేసిండు. హుజూరాబాద్‌‌లో మాత్రం ఉప ఎన్నికలు ఉన్నాయని వద్దన్నా ఇస్తుండ్రు’ అని రేవంత్ పేర్కొన్నారు. 

కరోనా కంటే కేసీఆరే డేంజర్
‘ఎవరన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చనిపోతేనే పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. సమాజంలో సగభాగం ఉన్న బీసీల కోసం బడ్జెట్‌‌లో 3 శాతం కేటాయిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా వస్తలేవు. దుబ్బాక, సాగర్.. ఇప్పుడు హుజూరాబాద్‌‌లో పథకాలు అమలవుతున్నాయి. 1.91 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా చేయడం లేదు. దీని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు బాగా నష్టపోతున్నారు. కరోనా కంటే కేసీఆర్ డేంజర్. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వచ్చింది. కేసీఆర్ పోవాలంటే.. ఎలక్షన్ రావాలె’ అని రేవంత్ చెప్పారు.