అందెశ్రీ మృతి సాహితీ లోకానికి తీరని లోటు : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ

అందెశ్రీ మృతి సాహితీ లోకానికి తీరని లోటు : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: అందెశ్రీ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం ఉట్నూర్​లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో పలువురు నాయకులు, కళాకారులతో కలిసి అందెశ్రీ ఫొటోకు పూలమాలవేసి నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి అందెశ్రీ హఠాన్మరణం ఎప్పటికీ పూడ్చలేని లోటని అన్నారు. మలిదశ ఉద్యమ కెరటమై, రాష్ట్ర సాధన ఆకాంక్షను కోట్లాది ప్రజల గుండెల్లో నిలిపిన చారిత్రక గీతాన్ని అందించిన మహనీయుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం, తెలంగాణ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జాదవ్ సునీల్, కాంగ్రెస్ నాయకులు పంద్రం శేక్కు, కనక రాజు గుస్సాడి అసోసియేషన్ అధ్యక్షుడు కనక సుదర్శన్, కళాకా రులు పాల్గొన్నారు.

అందెశ్రీకి ఘన నివాళి

బెల్లంపల్లి: తెలంగాణ జానపద కళాకారుల సంఘం, ప్రజాసంఘాలు, మేధావులు బెల్లంపల్లిలో నివాళులు అర్పించారు. తిలక్​ మైదానం నుంచి కాంటా చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో నివాళులు అర్పించారు. జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్, పట్టణ అధ్యకుడు దినేశ్​ కుమార్, కళాకారులు పాల్గొన్నారు.