చస్తే స్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు

చస్తే స్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 

వరంగల్: రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో చస్తే స్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారంటే పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతుందన్నారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి తర్వాత మీడియా సమావేశంలో ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా వేగంగా విస్తరిస్తోందని... కరోనా మరణాలు పెరుగుతున్నా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కరోనా విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్లే చాలామంది చనిపోతున్నారని.. కరోనా రెండో దశ విజృంభణ ఉంటందని తెలిసినా.. ప్రభుత్వాలు ఎలాంటి  ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చనిపోతే స్మశానవాటిక  కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు. కరోనా వైద్యంలో నిర్లక్ష్యం చేసిన నాయకులకు ఓటు వేయొద్దని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 
రాష్ట్రం వచ్చాక వరంగల్ కు గ్రహణం పట్టింది
తెలంగాణ రాష్ట్రం వచ్చాక వరంగల్ కు గ్రహణం పట్టుకుందని.. ఎంతో ఘన చరిత్ర ఉన్న వరంగల్ జిల్లాను అధికార పార్టీ నేతలు ముక్కలు చెక్కలు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి దాత అయిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ఏకశిలా పార్కును తాగుబోతులకు అడ్డగా మార్చివేశారని.. జయశంకర్ సార్ ఫోటోలకు బదులకు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు పెట్టుకున్నారంటే ఇంతకంటే భావ దారిద్ర్యం ఎక్కడైనా ఉంటుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో తాను వరంగల్ సందర్శించినప్పుడు ఏకశిలా పార్కును సందర్శించగా తాగుబోతులు విసిరేసిన ఖాళీ సీసాలు కనిపిస్తే వాటిని ఏరి వేయించానన్నారు. ఎక శిలా పార్కును తాగుబోతులకు అడ్డగా మార్చడం దారుణం అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉండడం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషివల్లేనని.. రైల్వే ఓవరాలింగ్ ఫ్యాక్టరీ విషయంలో టీఆర్ఎస్,బీజేపీ నాయకులు మాయమాటలు చెప్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ మనదేశానికి టూరిస్ట్ మాత్రమే...ఎన్ని రోజులు మనదేశంలో ఉన్నాడో లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు బీజేపీ వాళ్లే అవార్డుల ఇస్తారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను  ప్రజా సంఘాలకు నాయకత్వం వహిస్తానని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాసంఘాల పై నిషేధాన్ని విధించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలతో చర్చలు జరపాలని, కానీ చర్చించకుండానే ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాల పై నిషేధించడాన్ని తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. 
ప్రతి చోటా ఇవే మాటలతో బీజేపీ వాళ్లు మభ్యపెడుతున్నారు
తెలంగాణ బీజేపీలో అబ్లు- పబ్లు( అరవింద్ ,బండి సంజయ్..) ఇద్దరూ కలసి ప్రతి ఎన్నికల్లో ఇవే మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ వాళ్లు ప్రతి ఎన్నికలలో ఇవే మాటలు చెప్తున్నారని, అధికారంలో మీరే వున్నారు కదా కేసీఆర్ పై ఎందుకు చర్యలు ఎందుకు తీసు కొవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ - బీజేపీ ఇద్దరు కలసి కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికే కలిసి వెళ్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ-టీఆర్ఎస్ నేతలను పాముల ను ఆడించే గారడి గాళ్లతో పోల్చారు రేవంత్ రెడ్డి. వినయ్ భాస్కర్ కి నెక్స్ట్ టైమ్ టికెట్ వస్తదో రాదో తెలియని పరిస్థితి, టెక్స్ టైల్ పార్క్ ,ఐటీ పార్క్, డంపింగ్ యార్డ్ నిర్లక్ష్యానికి టీఆర్ఎస్ కారణం కాదా? అని రేవంత్ నిలదీశారు. ఎన్నికలలో గెలవాలనే చూస్తున్నారు కానీ...అభివృద్ధి ఏమి  చేశారని ఓట్లు అడుగుతున్నారని, కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా వరంగల్ నగరానికి ఎలాంటి కార్యచరణ తీసుకున్నాడు ప్రసంగాలు తప్ప అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలను మున్సిపల్ ఎన్నికల్లో ఓడ గొట్టాలని ఆయన వరంగల్ ప్రజలకు విజ్జప్తి చేశారు.