రైతులు ట్రాక్టర్ ర్యాలీ తీస్తే తప్పేంటి?

రైతులు ట్రాక్టర్ ర్యాలీ తీస్తే తప్పేంటి?

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలకు ముగింపు పలకాలని కోరుతూ అన్నదాతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. దీంతో నిరసనలను మరింత తీవ్రతరం చేయాలని రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంద్రాగస్టున హరియాణాలోని జింద్‌తోపాటు దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీకి  సమాయత్తం అవుతున్నారు. ఈ విషయంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. రైతులు ట్రాక్టర్ ర్యాలీ తీస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. 

‘అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ తీయడంలో తప్పేముంది? ట్రాక్టర్ ర్యాలీ తీయడం చెడ్డ విషయమేం కాదు. హరియాణాలోని జింద్‌ ప్రజలు విప్లవాత్మక భావాలు కలిగిన వారు. పంద్రాగస్టున ట్రాక్టర్ పరేడ్ చేయాలని వారు తీసుకున్న నిర్ణయం సరైనదే.  అయితే సంయుక్త కిసాన్ మోర్చా ఏ నిర్ణయం తీసుకుంటనేది చూడాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున రైతులు జాతీయ జెండాలతో పరేడ్ తీస్తే గర్వంగా ఉంటుంది. ఇది జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తుంది’ అని తికాయత్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు తీసిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. రైతులను ఢిల్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.