
వినాయక చవితి.. పండుగ పూట.. సెలవు ఉంది కదా అని ఊరెళ్దాం అనుకున్న నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కామారెడ్డి హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
బుధవారం (ఆగస్టు 27) వానలు దంచి కొడుతుండటంతో ఎక్కడ చూసిన వరదలు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తు్న్నాయి. కామారెడ్డి రూట్ లో Nh44 పై నార్సింగ్ వద్ద రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. నార్సింగ్ వద్ద చెరువు అలుగు పారుతుండడంతో హైవేపై భారీగా వరద నీరు చేరుకుంది. వరద పారుతుండటంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.
మరోవైపు కామారెడ్డి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. ఏకంగా 36 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటంతో పంటపొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తూ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి- హైద్రాబాద్ రోడ్ మార్గంలో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జాం అయ్యింది. బిక్నూర్ టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి.