రేపట్నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా జరిమానా

రేపట్నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా జరిమానా

హైదరాబాద్లో రేపటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. ట్రాఫిక్ కంట్రోల్, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ మరింత పక్కాగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఇకపై భారీగా ఫైన్లు విధించనున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు సర్వేలో తేలటంతో ఆంక్షలను పక్కగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకు రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ కు రూ.1200 వరకు ఫైన్ విధించనున్నారు. ప్రభుత్వం జీవో ప్రకారమే రూల్స్ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రూల్స్ బ్రేక్ చేస్తూ పట్టుబడితే వాహనదారుడిపై గతంలో ఏమైనా చలాన్లు ఉన్నాయా.. లేదా అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు. సిటీలో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్  చేయటంతో ఇబ్బందులు వస్తున్నందున ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ గా అమలు చేయనున్నారు.