కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోరం.. ఈ పాపం ఎవరిది..? 

కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోరం.. ఈ పాపం ఎవరిది..? 

ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోరం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసిన కొద్దీ దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కలకలం రేగింది. పెద్ద ఎత్తున అర్తనాదాలు వినిపించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం పూర్తిగా రక్తసిక్తమైంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న  బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు  ప్రాణభయంతో పరుగులు తీయడం కనిపించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ దుర్ఘటన జరగంతో అందరూ షాక్ లో ఉన్నారు. 

ప్రమాదం వెనుక..?

బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతోనే గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిందని చెబుతున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కొందరు కార్యకర్తలు సంతోషంలో పటాకులు పేల్చారని, దీంతో నిప్పు రవ్వలు ఎగిరి.. పక్కన ఉన్న ఓ గుడిసెలో ఉన్న సిలిండర్ పై పడడంతో అది పేలిందని అంటున్నారు. ఈ ప్రమదంలో స్పాట్ లో ఒకరు చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో వ్యక్తి చనిపోయారని తెలుస్తోంది. గాయపడ్డ వారిలో పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారని సమాచారం అందుతోంది. 

నిర్లక్ష్యం ఖరీదు

స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు కేవలం ప్రజాప్రతినిధులకు రక్షణపై దృష్టిపెట్టారని, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పటాసులు పేల్చే సయమంలో వద్దని వారించే వారెవరూ లేరని చెబుతున్నారు. ముందుగానే పోలీసులు పటాకులు కాల్చొద్దని హెచ్చరించి ఉంటే .. ఇంతంటి ఘోరం జరిగి ఉండేది కాదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

ప్రమాదానికి, మీటింగ్ కు సంబంధం లేదు : ఎంపీ నామా

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి, సిలిండర్ పేలుడు ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ నామా నాగేశ్వర్ రావు చెప్పారు. తాము ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందన్నారు.  మీటింగ్ ప్రారంభయ్యే సమయంలో తామంతా స్టేజీపై ఉన్నామని, అప్పుడే సిలిండర్ పేలిందని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎండల తీవ్రత వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చన్నారు. చిన్న గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా బాధితులను ఆదుకుంటామని ఎంపీ నామా చెప్పారు. బాణాసంచా కాల్చడం వల్లే ప్రమాదం జరగలేదని మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. గుడిసెలో సిలిండర్ ఉన్న విషయం ఎవరికీ తెలియదన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు కూడా తరలించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను ఆదేశించామన్నారు. 

ఆదుకుంటాం : ఎమ్మెల్యే రాములు నాయక్

బాణా సంచా వల్లే సిలిండర్ పేలిందని తాము ఇప్పుడే చెప్పలేమని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. ‘‘సంతోషంలో కార్యకర్తల బాణాసంచా కాలుస్తుంటారు. నిర్లక్ష్యం మాత్రం ఏమీ లేదు. బాధితులను తప్పనిసరిగా ఆదుకుంటాం. ప్రస్తుతం ఈ విషయంలో అందరూ స్పందించాలె. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం దర్యాప్తులో తేలుతుంది’’ అని చెప్పుకొచ్చారు. 

సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్ పేలి.. ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కూడా ఫోన్ చేసి, ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. మరోవైపు.. మంత్రి కేటీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.