రూ.4.14 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి.. అన్నను లేపేసిన తమ్ముడు.. కరీంనగర్ జిల్లాలో టిప్పర్ను మీదకు పోనిచ్చి..

రూ.4.14 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి.. అన్నను లేపేసిన తమ్ముడు.. కరీంనగర్ జిల్లాలో టిప్పర్ను మీదకు పోనిచ్చి..
  • ప్రమాదమని సీన్ క్రియేషన్  
  • ఆ హత్యను చూసిన అల్లుడు.. జరిగింది చెప్పడంతో బట్టబయలు  
  • నిందితుడు, మరో ఇద్దరి అరెస్ట్   
  • కరీంనగర్ జిల్లా రామడుగులో ఘటన

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/రామడుగు, వెలుగు: మతి స్థిమితం సరిగ్గాలేని అన్న పేరిట కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు, లక్షలాది రూపాయల గోల్డ్ లోన్ తీసుకున్నాడు ఓ తమ్ముడు. తర్వాత ప్లాన్ ప్రకారం అన్న మీదుగా టిప్పర్ పోనిచ్చి హత్య చేశాడు. తన అన్న ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి చనిపోయాడని అందరినీ నమ్మించి, ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్రయత్నించాడు. కానీ, ఈ హత్యను కళ్లారా చూసిన అల్లుడు జరిగిన విషయం చెప్పడంతో నేరం బట్టబయలైంది. నిందితుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నవంబర్ 29న జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మంగళవారం మీడియాకు వెల్లడించారు. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మామిడి వెంకటేశ్(37), మామిడి నరేశ్ ఉన్నారు. వెంకటేశ్ కు పెళ్లి కాలేదు. అతని మానసిక స్థితి కూడా సరిగా లేదు. నరేశ్ టిప్పర్లను నడపడంతోపాటు పలు వ్యాపారాలు చేస్తున్నాడు. 

షేర్ మార్కెట్​లో పెట్టుబడులు, టిప్పర్ల ఈఎంఐల కోసం రూ.1.50 కోట్ల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో వెంకటేశ్ పేరు మీద వివిధ బ్యాంకుల్లో ఇటీవల రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. యాక్సిస్ బ్యాంకులో రూ.20 లక్షల గోల్డ్ లోన్ తీశాడు. వెంకటేశ్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావడంతో పాటు గోల్డ్ లోన్ కూడా మాఫీ అవుతుందన్న ఆలోచనతో అతడిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. 

అల్లుడు చెప్పడంతో గుట్టురట్టు..  

వెంకటేశ్ హత్యకు సహకరించాలని నరేశ్ కోరగా.. అందుకు నముండ్ల రాకేశ్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ ఒప్పుకున్నారు. నవంబర్ 29న రాత్రి మట్టి లోడ్ నింపుకుని గ్రామ శివారుకు రావాలని డ్రైవర్ మునిగాల ప్రదీప్​కు, నముండ్ల రాకేశ్​కు నరేశ్ సూచించాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం టిప్పర్ బ్రేక్ డౌన్ అయిందని నరేశ్​కు ప్రదీప్ ఫోన్ చేశాడు. తన అల్లుడు సాయి, అన్న వెంకటేశ్​కు జాకీ ఇచ్చి పంపిన నరేశ్.. వారి వెనకే మరో బైక్​పై వెళ్లాడు. 

ఘటనా స్థలంలో డ్రైవర్ ప్రదీప్ టిప్పర్​ను స్టార్ట్ చేసి ఉంచి, టైర్ కింద జాకీ పెట్టాలని వెంకటేశ్ కు సూచించాడు. అతడు చెప్పినట్టుగా వెంకటేశ్ జాకీ పెట్టి తిప్పుతుండగా.. అక్కడికి చేరుకున్న నరేశ్​టిప్పర్​ను ముందుకు నడిపించాడు. దాంతో టిప్పర్ టైర్ వెంకటేశ్​పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్ కావాలనే టిప్పర్ ను ముందుకు నడపడం చూసిన సాయి.. ఆ విషయాన్ని తాత మామిడి నర్సయ్యకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మామిడి నరేశ్, నముండ్ల రాకేశ్, మునిగాల ప్రదీప్​ను అరెస్టు చేశారు. 

ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వెంకటేశ్ ను హత్య చేసినట్లు వారు విచారణలో ఒప్పుకున్నారు. రాకేశ్ ఫోన్ లో మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్న వీడియోను కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ తోపాటు ఇన్సూరెన్స్ పాలసీల డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ బుక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించనున్నట్లు తెలిపారు.