సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ప్రచారం జోరుగా చేస్తూనే ఉన్నాడు. గ్రామ ప్రజలందరిని కలుస్తూ ఓటు వేయాలని అడుగుతున్నాడు. అంతా బాగానే ఉంది.. ఈ సారి గెలుస్తాం అనుకుంటున్న సమయంలో పోలింగ్ కూడా చూడకుండా కనుమూశాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామ పంచాయతీ కాంగ్రెసు పార్టీ సర్పంచ్ ఆభ్యర్ధి రాయపాటి బుచ్చి రెడ్డి ( 60) గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం (డిసెంబర్ 08) ఎన్నికలకు సంబంధించి తన అనుచరులతో ఊరంతా తిరిగిన వ్యక్తి.. ఉన్నట్లుండి కుప్పకూలి పోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బుచ్చిరెడ్డి మృతి గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ , కాంగ్రెసు శ్రేణులు ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. సోమవారం పంచాయతి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ తోపాటు పాల్గొన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

