బ‌రాత్‌లో కాల్పులు జ‌రిపిన పెళ్లికుమారుడు.. స్నేహితుడు మృతి

బ‌రాత్‌లో కాల్పులు జ‌రిపిన పెళ్లికుమారుడు.. స్నేహితుడు మృతి

ల‌క్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు జరిపిన కాల్పుల్లో అతని స్నేహితుడు ప్రాణం కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన సోన్‌భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో జరిగింది. 

మనీష్ మధేషియా అనే వ్యక్తి పెళ్లి బ‌రాత్ లో భాగంగా రథంపై ఊరేగిస్తున్నారు. ఈ సమయంలో పెళ్లి కుమారుడి చుట్టూ అతడి ఫ్రెండ్స్, బంధువులు సందడి చేస్తూ కనిపించారు. ఇంతలో వరుడు తుపాకీతో గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. మరోసారి కాల్చేందుకు సిద్ధమవుతుండగా.. అనుకోకుండా ట్రిగ్గర్ పై చేతి వేళ్లు తాకాయి. దీంతో ప్రమాద‌వ‌శాత్తు పక్కనే ఉన్న వరుడు స్నేహితుడైన ఆర్మీ జవాన్ బాబు లాల్ యాదవ్ కు బుల్లెట్ తగిలింది. వెంటనే కింద పడిపోయిన బాబు లాల్ ను అక్కడే ఉన్న బంధువులు, స్నేహితులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైభ‌వంగా జ‌రుగుతున్న పెళ్లి వేడుక‌లో ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ ఘటన సోన్‌భద్ర జిల్లాలోని బ్రహ్మనగర్ ప్రాంతంలో జరిగింది. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అప్పటికే పరిస్థితి విషమించడంతో బాబు లాల్ యాదవ్ చనిపోయాడు. పెళ్లికొడుకు గాల్లోకి కాల్పులు జరిపిన తుపాకీ మృతుడు బాబు లాల్ యాదవ్ ది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన పెళ్లి కుమారుడిని అరెస్ట్ చేశామని, తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నామని సోన్‌భద్ర పోలీస్ సూపరింటెండెంట్ అమరేంద్ర ప్రతాప్ సింగ్ వెల్లడించారు. పెళ్లి వేడుకలు, పుణ్యక్షేత్రాలు, బహిరంగ సభలు, ప్రదేశాల్లో లైసెన్స్ పొందిన తుపాకులతో కాల్పులు జరపడం ఇండియాలో చట్టరీత్యా నేరమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.