వాడి వయసెంత..చేసిన పనేంటీ.! పేరెంట్స్ మందలించారని.. పురుగులమందు తాగిన 8ఏళ్ల బాలుడు

వాడి వయసెంత..చేసిన పనేంటీ.! పేరెంట్స్ మందలించారని.. పురుగులమందు తాగిన 8ఏళ్ల బాలుడు

బాలుడి వయసు నిండా ఎనిమిదేళ్లు  లేవు.. తల్లిదండ్రులు మందలించారని అతడు చేసిన పని అందరినీ షాక్ కు గురిచేసింది. స్కూలుకు వెళ్లడం లేదని పేరెంట్స్ మందలిస్తే  చస్తానని బెదిరించబోయి చివరికి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు  ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళితే..  

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసలతండాకు చెందిన గుగులోత్ రాందాసు, స్వరూపల కుమారుడు పవన్(8) అదే గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. గురువారం(మార్చి19) తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.  శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో  రాందాసు, స్వరూపలు ఆరా తీయగా పురుగుల మందు తాగానని చెప్పాడు.  దీంతో పవన్ ను చికిత్స కోసం హుటాహుటిన  హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు పవన్ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనతో పూసలతండావాసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పేరెంట్స్ మందలించినందుకు ఆత్మహత్య చేసుకోవడం ఏంటని విస్తుపోయారు. ఇంత చిన్న వయసులో పవన్ కు ఆత్మహత్య ఆలోచన రావడం అనేది పిల్లల మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.