ఆరేళ్ల ప్రేమ.. పెళ్లయి జస్ట్ వారం.. మటన్, చికెన్ లొల్లి.. ఎంత పని చేశావ్ తల్లీ !

ఆరేళ్ల ప్రేమ.. పెళ్లయి జస్ట్ వారం.. మటన్, చికెన్ లొల్లి.. ఎంత పని చేశావ్ తల్లీ !

జగిత్యాల: ‘బలగం’ సినిమాలో నల్లి బొక్క కోసం బావ బామ్మర్దులు గొడవ పడ్డట్టు.. మటన్, చికెన్ విషయంలో నవ దంపతుల మధ్య గొడవ వివాహిత ఆత్మహత్యకు దారి తీసింది. ఆరు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ ప్రజలను కలచి వేసింది. 

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని వడ్డెర కాలనీలో ఎదురెదురు ఇండ్లలో ఉండే సంతోష్, గంగోత్రి.. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల (సెప్టెంబర్) 26వ తేదీన పెళ్లి చేసుకున్నారు. దసరా రోజున దంపతులిద్దరూ గంగోత్రి తల్లి గారి ఇంటికి వెళ్లి భోజనాలు చేస్తున్న సమయంలో సంతోష్ మన ఇంట్లో మటన్ తెస్తే తినని నువ్వు.. మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని గంగోత్రిని ప్రశ్నించాడు. అది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. 

గంగోత్రికి మటన్ అంటే ఇష్టం ఉండదని, చికెన్ తింటుందని ఆమె కుటుంబం చెప్పింది. ఈ విషయంలో భర్తతో జరిగిన గొడవతో మనస్థాపం చెందిన గంగోత్రి అత్తగారింటికి వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని బంధువులు తెలిపారు. తినేటప్పుడు జరిగిన గొడవలు మనసులో పెట్టుకొని ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం వల్లే ఆమె మరణించిందని గాయత్రి తల్లి శారద ఆరోపిస్తోంది. చిన్న వయసులోని ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని చిన్న చిన్న గొడవలకే మనస్థాపాలు చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమ గ్రామంలో జరిగిన సంఘటన ఎంతో ఆందోళనకు గురిచేసిందని గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.