అరేయ్ తమ్ముడు.. ఈ సారి రాఖీ కట్టలేనేమో.. కన్నీళ్లు పెట్టిస్తున్న నవ వధువు లేఖ

అరేయ్ తమ్ముడు.. ఈ సారి రాఖీ కట్టలేనేమో.. కన్నీళ్లు పెట్టిస్తున్న నవ వధువు లేఖ

ఉయ్యూరు: అబ్బాయి ఒక గ్రామంలో విలేజ్ సర్వేయర్. అమ్మాయిని ఇతనికి ఇచ్చి చేస్తే సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబం నమ్మింది. అమ్మాయిని కూడా బాగా చదివించారు. ఒక ప్రైవేట్ కాలేజ్లో ఆమె లెక్చరర్గా పనిచేస్తోంది. ఇద్దరికీ పెళ్లి చేస్తే కలకాలం కలతలు దరిచేరకుండా పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తారని ఇరు కుటుంబాలు ఆకాంక్షించి ఇద్దరికీ పెళ్లి చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లే కావడంతో వారి వైవాహిక జీవితంపై ఇరు కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవు.

అయితే.. ఆ అమ్మాయి కుటుంబం ఊహించింది ఒకటి. ఆమె అనుభవించిన జీవితం మరొకటి. రెండిటికీ అసలు పొంతనే లేదు. ఒకరికొకరు నచ్చి అడుగులేసిన ఈ వైవాహిక బంధంలో పెళ్లైన నెల రోజులకే కలతలు రేగాయి. ఎన్నో ఆశలతో తనతో కలిసి ఏడడుగులు వేసిన ఆ 24 ఏళ్ల యువతికి నెల రోజులకే ఆమె భర్త నరకం చూపించాడు. మంచి వాడిగా అప్పటి దాకా కప్పుకున్న ముసుగు తీసేసి తనలోని శాడిస్ట్ను భార్యకు పరిచయం చేశాడు.

మద్యం తాగొచ్చి ఆమెను, ఆమె తండ్రిని నోటికొచ్చినట్లు అనరాని మాటలనేవాడు. ఆమెను తిట్టికొట్టి నరకం చూపించాడు. తన తలను మంచానికేసి కొట్టి.. వీపుపై పిడిగుద్దులతో దాడి చేసి శారీరకంగా టార్చర్ చేశాడు. తన కుటుంబానికి చెప్పలేదో.. సంసారం అన్నాక ఇలాంటివి సహజమని, సర్దుకుపోయి బతకాలని సలహా ఇచ్చారో స్పష్టత లేదు గానీ ఆరు నెలల పాటు భర్త శాడిజాన్ని ఆ నవ వధువు భరించింది. మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నా తనలో తాను కుమిలిపోయింది. ఇక.. ఆ నరకం తట్టుకోవడం తన వల్ల కాదని తనువు చాలించింది.

ఎంతో ఇష్టమైన తన తమ్ముడికి జాగ్రత్త చెప్పి.. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో అని బాధపడుతూ తాను పడిన బాధలను, తన భర్త శాడిజాన్ని లేఖ రాసి ప్రాణం తీసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న రాంబాబును పెళ్లి చేసుకున్న శ్రీవిద్య అనే 24 ఏళ్ల యువతి జీవితం ఇలా విషాదాంతంగా ముగిసింది. ఈ స్థితికి కారణమైన తన భర్త రాంబాబును, అతని కుటుంబసభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని లేఖ రాసి ఉరేసుకొని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.