తల్లికి అన్నం పెట్టని..కొడుకు ఇంటి ఎదుట వృద్దురాలి ఆందోళన

తల్లికి అన్నం పెట్టని..కొడుకు ఇంటి ఎదుట వృద్దురాలి ఆందోళన

మంచిర్యాల: కన్నకొడుకు అన్నం పెట్టలేదని తల్లి రోడ్డెక్కిన దుస్థితి మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఉద్యోగి అయి ఉండి కూడా తల్లికి పట్టెడు అన్నం పెట్టని కొడుకు ఇంటి ఎదుట బైఠాయించింది వృద్దురాలు. తన పేరున ఉన్న 4 ఎకరాల భూమిని సైతం ఆక్రమించుకుని ఇంటినుంచి బయటికి నెట్టేయడం దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్​ బస్తీలో కొడుకు అన్నం పెట్టడం లేదని అతని ఇంటి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టింది పొట్ట బాలమ్మ అనే వృద్దురాలు. బాలమకు నలుగురు కొడుకులు..ముగ్గురు కొడుకులు చనిపోగా..ఉన్న కొడుకు పొట్ట రమేష్​..సింగరేణి ఉద్యోగి..భర్త వారసత్వంగా సింగరేణిలో ఉద్యోగం పెట్టించింది పొట్ట బాలమ్మ.

ఉన్న ఇంటిని కూడా లాక్కొని కిరాయిలకు ఇచ్చి..ఇంటిపై రేకుల షెడ్డులో బాలమ్మను ఉంచారు. బాలమ్మ పేరున ఉన్న 4 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా జీవిస్తోంది బాలమ్మ. 

వృద్దాప్యంతో తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో పట్టెడు అన్నం పెట్టేవాళ్లు లేక నానా అవస్థలుపడుతోంది బాలమ్మ. దిక్కుతోచని స్థితిలో  కొడుకు ఇంటిముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కొడుకు రమేష్​ ఇంటిముందు నిరసన తెలిపింది బాలమ్మ.