
- ఓ యువతితో ప్రేమలో పడ్డ డాక్టర్.. విషయం తెలిసి సూసైడ్ చేసుకున్న భార్య
- మరో చోట 47 ఏండ్ల వ్యక్తి ప్రేమలో పడిన 20 ఏండ్ల యువతి
- ఇంట్లోంచి పారిపోయి ఆత్మహత్య చేసుకున్న వైనం
- గ్రేటర్ వరంగల్ పరిధిలో వెలుగుచూసిన ఘటనలు
వరంగల్/హసన్‍పర్తి/వరంగల్ సిటీ, వెలుగు : పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత మరో యువతిపై ఏర్పడిన ప్రేమ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో సోమవారం ఇలాంటి రెండు ఘటనలు వెలుగుచూడగా... ఓ కేసులో యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకోగా.. మరో ఘటనలో 47 ఏండ్ల ప్రియుడు, 20 ఏండ్ల ప్రియురాలు సూసైడ్ చేసుకున్నారు. మరో యువతితో ప్రేమలో పడిన భర్త..
సూసైడ్ చేసుకున్న భార్య
తన భర్త మరో యువతితో ప్రేమాయణం నడిపించడం, విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మనస్తానికి గురైన ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, హసన్‌పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రేటర్ వరంగల్ మట్టెవాడకు చెందిన డాక్టర్ తంజావూరు ప్రత్యూష (32)కు భద్రాచలం జిల్లా చర్లకు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్‌తో 2017లో పెండ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సృజన్ కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలోని పీఎంఎస్‍ఎస్‍వై హస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే, హంటర్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ కార్డియాలజీ సర్జన్‌గా పనిచేస్తున్నాడు.
ప్రత్యూష ఎన్‌ఎస్‍ఆర్ హస్పిటల్‌లో డెంటల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇద్దరు పిల్లలతో కలిసి హసన్‌పర్తి సమీపంలోని కాకతీయ వింటేజ్‌లో ఉంటున్నారు. మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇన్‌స్టాలో రీల్స్ చేసే బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్‌కు పరిచయం కాగా.. ప్రమోషన్ పేరుతో ఇద్దరూ రెగ్యులర్‌గా కలిసేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ విషయం ప్రత్యూషకు తెలియడంతో గొడవలు జరిగాయి. ఆదివారం సాయంత్రం సృజన్, ప్రత్యూష మధ్య మరోసారి గొడవ జరిగింది.
ఈ క్రమంలో సృజన్ శ్రుతితోనే ఉంటానని చెప్పడంతో పాటు విడాకులు ఇవ్వాలని ప్రత్యూషపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన సృజన్ స్థానికుల సాయంతో హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. తన కూతురు మృతికి సృజన్, అతడి తల్లిదండ్రులు మధుసూదన్, పుణ్యవతితో పాటు బానోతు శ్రుతి కారణమని ప్రత్యూష తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యూషను సృజనే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
20 ఏళ్ల యువతితో 47 ఏండ్ల వ్యక్తి ప్రేమాయణం
భార్యా పిల్లలున్న 47 ఏండ్ల ఓ వ్యక్తి 20 ఏండ్లు ఉన్న ఓ యువతితో ప్రేమాయణం నడిపాడు. విషయం ఇద్దరి ఇండ్లలో తెలియడంతో పంచాయితీ పెట్టి మందలించారు. చివరకు ఇద్దరూ కలిసి పారిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో వేల్పుగొండ స్వామి (47) భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు.
వీరి ఇంటి సమీపంలోనే వెలిశాల గాయత్రి (20) కుటుంబంతో ఉంటోంది. ఈ క్రమంలో స్వామి, గాయత్రి మధ్య ప్రేమ మొదలైంది. ఈ విషయం ఇద్దరి ఇండ్లలో తెలియడంతో గొడవలు జరిగి, పంచాయితీ వరకు వెళ్లింది. తర్వాత స్వామి కుటుంబం ఇందిరమ్మ కాలనీ నుంచి మరో ప్రాంతానికి మారారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 2 నుంచి స్వామి, గాయత్రి కనిపించకుండాపోయారు. గాయత్రి కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదుచేశారు.
ఈ క్రమంలోనే 12న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ ప్రాంతంలో స్వామి, గాయత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గుర్తించిన స్థానికులు వారిని ఎంజీఎం హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ 13న రాత్రి స్వామి చనిపోగా.. సోమవారం తెల్లవారుజామున గాయత్రి మరణించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.