బావిలోంచి బతికొచ్చినా..వెంటాడిన విధి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

బావిలోంచి బతికొచ్చినా..వెంటాడిన విధి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

బెల్లంపల్లి, వెలుగు: ప్రమాదవశాత్తు మోటార్​సైకిల్​తో సహా బావిలో పడ్డడు. అందుట్లనే 36 గంటలు బయటకు రాలేక విషసర్పాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిండు. అయినా, కిస్మత్​గట్టిగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డడు. కానీ.. చావు ఎప్పుడు ఏ రూపంలో మింగేస్తదో అంతుపట్టదు. అప్పుడు బావిలో పడి, పాముల మధ్య ఉన్నా మృత్యుంజయుడిగా వచ్చిన అతడు.. శుక్రవారం సెల్​ఫోన్​మాట్లాడుతూ పట్టాలపై నిలుచోగా రైలు ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల జిల్లా తాండూర్​ రైల్వేస్టేషన్​లో ఈ సంఘటన జరిగింది.

జమ్మికుంటకు చెందిన వరికెల రాజమొగిళి(60) పత్తి వ్యాపారం చేసేవాడు. శుక్రవారం వ్యాపార పనుల నిమిత్తం జమ్మికుంట నుంచి కాగజ్​నగర్​కు ఇంటర్​సిటీ రైలులో వస్తున్నాడు. రేచిని రైల్వేస్టేషన్​లో  క్రాసింగ్ ఉండటంతో రైలు ఆగింది. తోటి ప్రయాణికులతో కలిసి రాజమొగిళి కూడా కిందికి దిగాడు. సెల్​ఫోన్ మాట్లాడుతూ పక్కన ఉన్న పట్టాల పైకి వెళ్లాడు. సరిగ్గా అప్పుడే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్​వేగంగా వచ్చి రాజమొగిళిని ఢీకొట్టింది. రెప్పపాటులో అతడు విగత జీవిగా మారిపోయాడు. రాజమొగిళికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు రవికుమార్​ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమొగిళి గతంలో కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడినా మృత్యుంజయుడిగా బయటపడ్డాడని, కానీ ఇప్పుడిలా చనిపోతాడని అనుకోలేదని ఆయన సన్నిహితులు విచారం వ్యక్తంచేశారు.