SSC ఎగ్జామ్స్​ రోజు విషాద ఘటనలు

SSC ఎగ్జామ్స్​ రోజు విషాద ఘటనలు
  • జీవితంలో అసలు ‘పరీక్ష’
  • తెలిసి ఒకరు..తెలియక మరొకరు ఎగ్జామ్స్ కు..

ఏడాదంతా కష్టపడి చదివి బోర్డు పరీక్షకు సిద్ధమైన వేళ తండ్రి చనిపోయాడని తెలుసుకున్న ఆ విద్యార్థిని శోకసంద్రంలో మునిగిపోయింది. జీవితాన్నిచ్చిన తండ్రి ఒకవైపు నిర్జీవంలా పడి ఉండగా భవిష్యత్​కు బాటలు వేసే ఎస్సెస్సీ పరీక్షకు హాజరైంది.  తండ్రితో గడిపిన క్షణాలు జ్ఞప్తికి వస్తూ కన్నీళ్లు ఉబికివస్తున్నా ఆ బాధను దిగమింగుకుని ఎగ్జామ్​రాసింది. మరో చోట ఓ విద్యార్థి తండ్రి చనిపోగా తెలిస్తే ఎక్కడ పరీక్ష సరిగ్గా రాయడో అని సాయంత్రం వరకు తెలియనివ్వలేదు. సెంటర్ ​నుంచి బయటకు వచ్చాక విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించాడు.  

నాన్నా...నువ్వు లేవని...
దేవరకొండ (కొండమల్లేపల్లి) : కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన పురుషోత్తమాచారి అనారోగ్యంతో హైదరాబాద్​లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. ఈయనకు ఎస్సెస్సీ చదువుతున్న లలిత అనే బిడ్డ ఉంది. ఈమె కొండమల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్​లో సోమవారం పరీక్ష రాసేందుకు వెళ్తుండగా, తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. దీంతో అక్కడే ఏడుస్తూ కూర్చుంది. పరీక్ష సమయం దగ్గర పడుతుండడంతో బంధువులు, స్నేహితులు వచ్చి లలితకు నచ్చజెప్పి తీసుకెళ్లారు. చివరకు పరీక్ష పూర్తి చేసి వెళ్లి తండ్రికి కడసారి వీడ్కోలు చెప్పింది. 

చావు వార్త చెప్పలే...
జమ్మికుంట :  కరీంనగర్​ జిల్లా జమ్మికుంట సమీపంలోని ఇందిరానగర్​ కు చెందిన ఆరె సుభాష్​రెడ్డి (49) జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్​ పాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్​ఎల్​హెడ్​మాస్టర్. శనివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురికావడంతో హైద్రాబాద్​లోని ఓ హాస్పిటల్​లో జాయిన్​ చేయించారు. సోమవారం తెల్లవారుజామున చనిపోవడంతో డెడ్​బాడీని ఇందిరానగర్​కు తీసుకువచ్చారు. ఈయన చిన్న కొడుకు చైతన్య హన్మకొండలోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో ఎస్సెస్సీ చదువుతున్నాడు. సోమవారమే పదో తరగతి పరీక్షలు షురూ కావడంతో తండ్రి మరణవార్తను తెలియనివ్వలేదు. మధ్యాహ్నం పరీక్ష పూర్తి కాగానే అక్కడి నుంచి నేరుగా ఇందిరానగర్​ కు తీసుకువచ్చారు.  ఒక్కసారిగా తండ్రి భౌతికకాయాన్ని చూసిన గౌతమ్​ పెద్దపెట్టున రోదించాడు. 

అంబులెన్స్​లోనే పరీక్ష రాసిన స్టూడెంట్​
మిర్యాలగూడ : ఇటీవల రోడ్డు యాక్సిడెంట్​లో గాయపడిన ఓ టెన్త్​ స్టూడెంట్ అంబులెన్స్​లోనే పరీక్ష రాశాడు. విద్యాశాఖ అధికారుల కథనం ప్రకారం..నల్గొండ జిల్లా పాలకీడు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన బండావత్​ గౌతమ్​ స్థానిక రవీంద్రభారతి స్కూల్​లో టెన్త్​చదువుతున్నాడు. ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్​లో గాయపడగా, నడుము, కాలుకు సర్జరీ చేశారు. పరీక్ష హాల్​లో కూర్చుని పరీక్ష రాయలేని పరిస్థితిలో ఉన్నాడని, ఎలాగైనా ఎగ్జామ్ ​రాసే అవకాశం కల్పించాలని ఎంఈఓ బాలాజీనాయక్​కు విద్యార్థి తండ్రి బండావత్​ శంకర్​ విజ్ఞప్తి చేశాడు. దీంతో ఎంఈవో విద్యాశాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారు. సోమవారం పరీక్ష కేంద్రం రూమ్​వద్దకు అంబులెన్స్ లో వచ్చిన గౌతమ్​ కోసం ప్రత్యేక ఇన్విజిలేటర్​ను ఏర్పాటు చేశారు. దీంతో అతడు అంబులెన్స్​లోని స్ట్రెచర్ పై పడుకుని పరీక్ష రాశాడు.