టీఆర్‌‌ఎస్‌‌ నాయకులకు పనులివ్వలేదనే కలెక్టర్ల బదిలీ

టీఆర్‌‌ఎస్‌‌ నాయకులకు పనులివ్వలేదనే కలెక్టర్ల బదిలీ

 పండుగ ఏదైనా దండుకోవడమే వారి పని
మేడారం జాతరలో కనీస వసతులు కల్పించలే
200 కోట్లు కేటాయిస్తామని 98 కోట్లిచ్చారు- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌

హైదరాబాద్, వెలుగు: మేడారం జాతర పనులను నామినేషన్‌‌‌‌ పద్ధతిలో ఇవ్వలేదనే కక్షతోనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు నలుగురు కలెక్టర్లను బదిలీ చేయించారని, పండుగ ఏదైనా దండుకోవడమే వారి తీరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌‌‌ విమర్శించారు. మేడారంలో వసతుల కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పిన కేసీఆర్‌‌‌‌.. చివరకు 98 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌‌‌‌లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. జంపన్న వాగు వద్ద చెక్ డ్యాం కడతామని, అవసరమైతే తానే అక్కడ కూర్చుని పనులు చేయిస్తానని చెప్పిన సీఎం.. చివరకు మాట నిలబెట్టుకోలేదన్నారు. ఏ ఆలయానికి వెళ్లినా ఆ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెబుతారని, తర్వాత పైసా ఇవ్వరని విమర్శించారు. దక్షిణాది కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరలో భక్తులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిలైందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని బీజేపీ రాష్ట్ర శాఖ కేంద్ర మంత్రులను కలిసి కోరిందని, సీఎం ఒక్కసారి కూడా ఆ విషయంపై కేంద్రంతో చర్చించలేదన్నారు. తానే పెద్ద హిందువునని చెప్పుకునే కేసీఆర్.. రామ మందిరం నిర్మాణానికి ట్రస్ట్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై స్పందించాలని అన్నారు.

 బీజేపీ తరఫున 4 అంబులెన్స్‌‌‌‌లు

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించడం కోసం బీజేపీ తరఫున 4 అంబులెన్స్‌‌‌‌లను పంపుతున్నారు. వాటిని బీజేపీ స్టేట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో లక్ష్మణ్ జెండా ప్రారంభించారు.

రఘునందన్ విషయంపై పార్టీలో చర్చిస్తం

బీజేపీ లీడర్‌‌‌‌ రఘునందన్ రావుపై వచ్చిన ఆరోపణలపై లక్ష్మణ్​ స్పందించారు. ఆ విషయంలో వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు.