ఉద్యోగులు ఏపీకి బదిలీ.. తెలంగాణ వ్యవహారాలకు దూరం

ఉద్యోగులు ఏపీకి బదిలీ.. తెలంగాణ వ్యవహారాలకు దూరం
  • రెండు నెలల్లోనే టీఆర్ఎస్​తో కాంట్రాక్టు ముగిసిందనే ప్రచారం
  • బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ బిజీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు నెలల కిందట హడావుడి చేసిన ప్రశాంత్​ కిశోర్ టీమ్ కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయింది. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్​ తరఫున సర్వేలు చేపట్టిన పీకే టీమ్.. సడెన్​గా సర్వేలను ఆపేసింది. ఇక్కడున్న 40 సర్వే టీమ్​లను రెండు వారాల కిందటే ఏపీకి పంపించింది. మరోవైపు ప్రగతిభవన్​లో కేసీఆర్ తో వరుసగా చర్చలు జరిపిన పీకే.. ఇటీవల తెలంగాణకు దూరంగా ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్​కు, ప్రశాంత్ కిశోర్​కు మధ్య కాంట్రాక్టు రెండు నెలల్లోనే ముగిసిపోయిందా? అనే చర్చ మొదలైంది. బీహార్​ రాజకీయ వ్యవహారాల్లో పీకే బిజీగా ఉంటున్నారు. అక్కడే అక్టోబర్​ 2 నుంచి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఆయన తెలంగాణ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పీకే ఆధ్వర్యంలోని ఐప్యాక్​ టీమ్ తెలంగాణలో సర్వేలను ఆపేసి, సిబ్బందిని ఏపీకి పంపించడం చర్చనీయాంశంగా మారింది. పోయిన ఎన్నికల్లో ఏపీలో జగన్​తో ఒప్పందం చేసుకున్న ఐప్యాక్.. ఈసారి కూడా ఆయన తరఫున పని చేస్తోంది.  

రిపోర్టు బయటకు.. బెడిసికొట్టిన ఒప్పందం 

తెలంగాణలో కేసీఆర్​తో కుదిరిన ఒప్పందంతో నాలుగు నెలల కిందటే ఐప్యాక్​ఏజెన్సీ హైదరాబాద్​లో హెడ్​ఆఫీస్​ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. వచ్చే ఎన్నికల దృష్ట్యా సర్వేలు, అభ్యర్థుల ఎంపిక మొదలు సోషల్​ మీడియా క్యాంపెయిన్​, జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన సలహాలు సూచనలను అందించే కీలకమైన బాధ్యతలను​ పీకే టీమ్​కు టీఆర్ఎస్ అప్పగించింది. ప్రభుత్వ పథకాలపై ప్రజాభిప్రాయంతో పాటు పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ఎలక్షన్ల గెలుపోటములపై డబ్బుల ప్రభావాన్ని అంచనా వేసే మొదటి విడత సర్వేను ఈ టీమ్​ పూర్తి చేసింది.స్వయంగా పీకే గజ్వేల్​నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్​ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సగానికిపైగా నియోజకవర్గాల్లో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని పీకే తన తొలి సర్వే రిపోర్టును కేసీఆర్​కు అందించినట్లు బయటకు పొక్కింది. అప్పట్నుంచీ పీకే టీమ్​కు, టీఆర్​ఎస్​కు మధ్య గ్యాప్​ పెరిగిందని.. ముందుగా చేసుకున్న ఒప్పందం బెడిసికొట్టిందనే ప్రచారం జరిగింది. దీంతో సర్వేలు, పార్టీ వ్యవహారాలు, జాతీయ పార్టీ విషయాల్లో తలదూర్చకుండా కేవలం సోషల్​మీడియా పోస్టింగ్​లకు పరిమితం కావాలని ఐప్యాక్​ టీమ్ కు టీఆర్ఎస్​ కండీషన్లు పెట్టినట్లు తెలిసింది. దీంతో తెలంగాణలో కాంట్రాక్టు ఉన్నా లేనట్లేనని.. ఐప్యాక్ ఇక్కడ నియమించుకున్న ఉద్యోగులందరినీ వరుసబెట్టి ఏపీకి బదిలీ చేస్తోందనే డిస్కషన్​హాట్ టాపిక్​గా మారింది.